YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

25 లక్షలకు కొని...కోట్లు గడించారు

25 లక్షలకు కొని...కోట్లు గడించారు

విజయవాడ, సెప్టెంబర్ 16  
రాజధాని అమరావతి భూ వ్యవహారంలో తెలుగు దేశం పార్టీ చీఫ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్‌ కో బాగుపడ్డారని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని టీడీపీ నేతలకు  ముందే తెలుసునని చెప్పారు. భూములు కొనుగోలు చేసుకోవాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారని ఆరోపించారు. గుడివాడలో బుధవారం మంత్రి కొడాలి నాని మీడియాతో  మాట్లాడుతూ.. రాజధానిలో రైతులను మోసం చేసి ఎకరం రూ. 25 లక్షలకు కొనుగోలు చేశారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు  గడించారని విమర్శించారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నామని మంత్రి నాని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కుంభకోణంపై కేబినెట్ సబ్‌ కమిటీ, సిట్‌ నియమించారు. గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్  ఆమోదంతో కేంద్రాన్ని కోరామన్నారు. కరోనా వల్లో లేకపోతే సీబీఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండటంతోనో జాప్యం జరిగిందని పేర్కొన్నారు.దీనిపై కేంద్రం నిర్ణయం రాకపోవడంతో ఏసీబీ  దర్యాప్తునకు సీఎం జగన్ ఆదేశించారని మంత్రి నాని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు లాయర్లకు కోట్లాది  రూపాయల ఫీజులు చెల్లించి.. కోర్టులో వారి పేర్లు బయటకు రాకుండా స్టేలు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన మాస్టర్ అని, ఆయన ఎన్ని  స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. చంద్రబాబు ప్రమేయం ఉందని తేలితే ఆయన మీద కూడా కేసులు పెడతామని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రజలే శిక్ష వేశారని, ప్రస్తుతం  ఆయన ఇంట్లో ఉంటూ జైలు జీవితం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోర్టుల నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ప్రజల నుంచి శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన 40 ఏళ్ల  రాజకీయ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ సొంత మనుషులను పెట్టుకుని.. వాళ్లను అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.  

Related Posts