క్యూలైన్ ఉండదు.. అంతా ఆన్‌లైన్
మీ మొబైల్ నుంచే ఓపీ రిజిస్ట్రేషన్
రిపోర్టుల కోసం చుట్టూ తిరగక్కర్లేదు
నేటి నుంచి అందుబాటులోకి యాప్
3 కోట్ల ‘ఈబస్ ఎండోస్కోపీ’ యూనిట్
నిమ్స్‌లో వైద్యం కోసం ఇక గంటలు తరబడి నిల్చోవాల్సిన పని లేదు. పడిగాపులు కాసి సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదమూ ఉండదు. టైం అయిపోయిందని రోగులను తిప్పి పంపే పరిస్థితులకూచెక్ పడినట్టే. రక్త, మూత్ర పరీక్షల రిపోర్టుల కోసం కాళ్లరిగేలా తిరగక్కర్లేదు. అవి మీ చెంతకే వస్తాయి. ఈ మార్పు సర్కారు ఆధ్వర్యంలో నడిచే నిమ్స్ ఆస్పత్రిలో ఎలా సాధ్యమనేగా మీ అనుమానం! ఓపీ రిజిస్ట్రేషన్, రిపోర్టుల కోసం నిమ్స్ ప్రత్యేకంగా ఒక ‘యాప్’ రూపొందించింది. ఇది సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇక నుంచి పేషెంట్లకు సంబంధించిన నివేదికలను రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
యాప్ ఎలా పని చేస్తుందంటే...
స్మార్ట్ ఫోన్లున్న వారు గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి నిమ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ అడిగే రోగి వివరాలను నమోదు చేయాలి. వెంటనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ఒకటి వస్తుంది. ఓపీ కౌంటర్‌కు వెళ్లి ఆ నంబరు చెప్పి డబ్బు చెల్లిస్తే ప్రింటవుట్ ఇస్తారు. ఇదంతా రెండు మూడు నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇంటి దగ్గర నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఓపీ నమోదు చేసుకోవాలంటే ఉదయమే నిమ్స్‌కు వెళ్లి క్యూ కట్టాలి. గంటల తరబడి నిలుచోవాలి. ఒక్కోసారి టైం అయిపోయిందని తిప్పి పంపిన సందర్భాలూ ఉంటున్నాయి. యాప్‌తో ఆ కష్టాలు తీరినట్టే.
రిపోర్టులు సర్వర్‌లో నిక్షిప్తం...
ఇప్పటిదాకా నిమ్స్‌లో రక్త, మూత్ర పరీక్షల కోసం ఉదయం శాంపిల్స్ ఇస్తే సాయంత్రానికో మరుసటి రోజుకో రిపోర్టులు ఇస్తున్నారు. ఒక్కోసారి రిపోర్టులు రాక నిమ్స్‌లోని బిల్డింగుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పేషెంట్లకు ఈ తిప్పలు తప్పినట్టే. సోమవారం నుంచి రోగులకు సంబంధించిన అన్ని రిపోర్టులను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వాటిని పేషెంట్లు మొబైల్ ఫోన్‌లోనే చూసుకోవచ్చు. వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు కూడా వారు రిపోర్టులు అడగరు. రోగికి ఇచ్చిన శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కంప్యూటర్‌లోనే వాటిని పరిశీలిస్తారు. రోగుల రిపోర్టులన్నీ శాశ్వతంగా నిమ్స్ ఆస్పత్రి సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. రిపోర్టులు పోవడం, మరచిపోవడమనే ప్రసక్తి ఉండదు.
3 కోట్ల ‘ఈబస్ ఎండోస్కోపీ’
కార్పొరేటు ఆస్పత్రుల్లో సైతం లేని అత్యాధునిక వైద్య పరికరం హైదరాబాద్ నిమ్స్‌లో అందుబాటులోకి వస్తోంది. ‘ఈబస్’గా వ్యవహరించే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ యూనిట్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో ఇంతటి ఖరీదైన మిషనరీ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఈబస్ తోపాటు లంగ్ డిఫ్యూజన్ మిషన్‌సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ బస్ ఎండోస్కోపీ యూనిట్ ఖరీదు రూ.3 కోట్లు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఛాతీ వ్యాధులు, శోషగ్రంథుల్లో వాపు వంటి వాటిని తేలిగ్గా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని నోటి ద్వారా పంపించి బయాప్సీ చేస్తారు. ఇప్పటివరకు బ్రాంకోస్కోపీ నిర్వహిస్తున్నా శ్వాసనాళాల లోపల ఉన్న గడ్డలు కనిపించేవి కావు. ఈబస్ ఎండోస్కోపీతో వాటినిసైతం కనుగొనవచ్చు. శ్వాసనాళాల బయట ఏమున్నదీ తెలుసుకోవడం తేలికవుతుంది. ఏమైనా గడ్డ ఉందా? లేక కేన్సర్, టీబీ సోకిందా తెలుసుకోవడం సాధ్యపడుతుంది. ఇప్పటివరకు ఇటువంటి గడ్డలను తొలగించాలంటే ఛాతీని ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఈబస్‌తో కోత లేకుండానే తొలగించవచ్చు.
సమయం, డబ్బు ఆదా
ఈబస్ ద్వారా ఊపిరితిత్తుల్లోని శ్వాస నాళాల బయట గోడలకు ఉండే గడ్డలను గుర్తించి తొలగించవచ్చు. ఈ ఆపరేషన్ చేయాలంటే నాలుగైదు గంటలు పడుతుంది. ఈబ్‌సతో కేవలం గంటన్నరలో పూర్తి చేసి... పేషెంట్‌ను అదే రోజు డిశ్చార్చి చేయవచ్చు. సాధారణంగా కనీసం నాలుగైదు రోజులు పేషెంట్ ఆస్పత్రిలోనే ఉండాల్సి వుంటుంది. మా దగ్గర ప్రత్యేకత ఏమిటంటే ఈబస్ ఎండోస్కోపీకి వాడే నీడిల్‌ను ఒక్కరికే వాడతాం. దీని ఖరీదు 13 వేల వరకు ఉంటుంది.