అమరావతి సెప్టెంబర్ 16
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక 11 ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇవాళ హిందూ ఆలయాలు, రేపు చర్చిలు, మసీదులపై దాడులు చేస్తారన్నారు. ఈ ఘటనలకు బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల అమ్మకం, తిరుమల టికెట్లపై అన్యమత ప్రచారం చేశారని, టీటీడీల డైరీల ముద్రణ తగ్గించేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆలయాల ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దుర్గగుడికి కూతవేటు దూరంలో మంత్రి వెల్లంపల్లి ఉన్నారని, ప్రభుత్వం, మంత్రులు లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే స్పందించామని చంద్రబాబు చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పాలన చేయడం సరికాదన్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, భక్తుల సంప్రదాయాలు, మనోభావాలను ప్రభుత్వం కాపాడాలన్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.