విజయవాడ, సెప్టెంబర్ 17,
పవన్ కల్యాణ్ స్వతహాగా సినిమా నటుడు. ఆయనకు కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం తేడా లేకుండా అభిమాన జనం నిండుగా ఉంటారు. నిజానికి రాజకీయ నాయకులందరికంటే కూడా ఆయనకు ఇది ఎంతో అడ్వాంటేజ్. కానీ పవన్ రాజకీయాల్లో మాత్రం పరిధులు, పరిమితులు విధించుకుంటూ తాను కొందరివాడినని అనిపించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నారనుకున్నా ఆయన పోయినన్ని పోకడలు వేరేవరూ పోలేదు, దాని వల్లనే పవన్ కల్యాణ్ అందరి వాడు అయి ఉండి కూడా ఎటూ కాకుండా పోయారని విమర్శలు ఉన్నాయి.పవన్ కల్యాణ్ ఎందుకు తనను తాను విశ్వసించి ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు అన్నది ఆయన్ని అభిమానించే వారి బాధ. ఆయన కనుక అలా అనుకుంటే ఏపీలో బీజేపీతో పొత్తు కడతారా అన్నది కూడా ప్రశ్న. పవన్ చేగువేరా నుంచి చాతుర్మాస దీక్షల దాకా తన రాజకీయ కధ నడిపించారు. దీంతో ఆయన తూర్పు పడమరలుగా ఉన్న కమ్యూనిస్టులను, కమలం పార్టీని కూడా కలుపుకున్నారు. అలా ఒక సిధ్ధాంతం అంటూ లేకుండా మిగిలిపోయారని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయల్లో బిగ్ ఫ్యాక్టర్ అని అనుకున్న వారికి ఆయన తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం మింగుడుపడేలా లేవు అని చెబుతున్నారు.చిరంజీవి పార్టీ పెట్టినపుడు తాను అందరివాడిని అన్నారు. ఆయన టికెట్లు ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ఇవ్వడం, ఆయన చుట్టూ ఎక్కువ మంది వారే ఉండడంతో ప్రజారాజ్యం మీద కుల ముద్ర పడింది. దాని వల్ల వచ్చిన చేదు అనుభవాలను దగ్గరుండి చూసిన పవన్ కల్యాణ్ ఇపుడు తానూ అదే దారిలోకి వెళ్ళడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో మరి. పవన్ కాపులకు జగన్ సర్కార్ అన్యాయం చేసిందని ఈ మధ్యనే హాట్ కామెంట్స్ చేశారు. వారిని బీసీల్లో చేర్చకుండా రిజర్వేషన్లు రానీయకుండా వైసీపీ చేసిందని కూడా అన్నారు. అలా పవన్ కల్యాణ్ అనడం ద్వారా కాపుల నేతగా ఎన్ని మార్కులు కొట్టారో కానీ బీసీలకు జనసేనకు చూరం చేశారు.ఇక ఇపుడు హిందూ అజెండా, జెండా పట్టేసి అచ్చమైన కాషాయధారిగా పవన్ అవతరిస్తున్నారు. ఎన్నికలకు ముందు కర్నూలు పర్యటనలో పవన్ కల్యాణ్ ముస్లింలను ఈ దేశ భక్తులు అన్నారు. వారిని వేరుగా చూడడం తగదు అంటూ బీజేపీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఇపుడు దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదెలా అంటే హిందువులను అన్యాయం జరుగుతూంటే మాట్లాడకుండా ఉండకూడదా. హిందువుల పేరు ఎత్తినే మతవాదిగా ముద్ర వేస్తారా అంటూ గర్జిస్తున్నారు. నిజానికి అన్ని మతాలు కలగలిపిన దేశం మనది. లౌకిక భావన మన ఆస్తి. పవన్ కల్యాణ్ సినిమాలు కూడా కుల మతాల పట్టింపులు లేకుండా అంతా చూస్తారు, రాజకీయాల్లో కూడా ఆయన ఆ పంధా అమలు చేసి ఉంటే బాగుండేది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ సిద్ధాంతాలతో కొట్టుకుపోతూంటే కొందరివాడిగా మిగిలిపోకతప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ తన విజయావకాశాలను తన అవగాహన రాహిత్యంతో దారుణంగా తగ్గించుకుంటున్నారని కూడా విమర్శలు ఉన్నాయి