విజయవాడ, సెప్టెంబర్ 17,
కాలం కలసిరానప్పుడు ఏం చేయలేం. అంతా మనం అనుకున్నట్లు జరగదు. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పరిస్థిితి కూడా అలాగే ఉంది. నిన్న మొన్నటి వరకూ సుజనా చౌదరి మంత్రి పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకూ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే గత నెల్లాళ్లుగా ఆయనకు ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. అందుకే సుజనా చౌదరి పెద్దగా హస్తినకు కూడా వెళ్లడం లేదంటున్నారు.మామూలుగా అయితే సుజనా చౌదరి హడావిడి మామూలుగా ఉండదు. బీజేపీకి తానే ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ ను అంటూ తిరిగే వారు. అనేక జిల్లాలను కూడా పర్యటించారు. కేంద్రంలో మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో ఆయన దానిపై ఆశలు పెట్టుకున్నారు. నలుగురు టీడీపీ రాజ్యసభ్యులతో కలసి వెళ్లినప్పుడు సుజనా చౌదరికి ఆ రకమైన హామీ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి హామీ లభించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందంటున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కసరత్తులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రివర్గ సభ్యుడున్నా, ఏపీ నుంచి ఎవరూ లేరు. దీంతో ఏపీ నుంచి ఒకరికి అవకాశం ఇస్తారంటున్నారు. కానీ మొన్నటి వరకూ కేంద్ర మంత్రివర్గంలోకి సుజనా చౌదరిని తీసుకుంటారని భావించారు. కానీ ఇప్పుడు సుజనా పేరును పక్కన పెట్టేశారంటున్నారు.దీనికి కారణం సుజనా చౌదరిపై టీడీపీ బ్రాండ్ చెరగకపోవడమే. దీనికితోడు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టారు. కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి. సుజనా చౌదరికి మంత్రి పదవి ఏపీ నుంచి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావించినా సోము ఖచ్చితంగా అభ్యంతరం తెలుపుతారు. ఢిల్లీలో ఉన్న జీవీఎల్ వంటి వారు కూడా అంగీరించే పరిస్థితి లేదు. అందుకే సుజనా చౌదరి సోము వచ్చిన నాటి నుంచి సైలెంట్ గా ఉన్నారంటున్నారు. మంత్రి పదవి మాత్రం సుజనా చౌదరి పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్లేనంటున్నారు. ఆయనకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే రాజ్యసభ పదవి ఉంది. ఆ తర్వాత ఇక మాజీగా ఉండాల్సిందే