హైద్రాబాద్, సెప్టెంబర్ 17,
ఛత్తీస్‌గఢ్ విద్యుత్... ఆది నుంచీ వివాదాస్పదమే! దార్శనికత, ముందుచూపు అంటూ రాష్ట్ర సర్కారు చేసుకున్న ముందస్తు ప్రచారం ఇప్పుడు బెడిసికొట్టింది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందమే తప్పంటూ అప్పట్లో విద్యుత్‌రంగ నిపుణులు నెత్తీనోరు కొట్టుకొని మొత్తుకున్నారు. వాటన్నింటినీ కాదనీ, అక్కడి నుంచి అతి తక్కువ ధరకే కరెంటు దొరుకుతుందంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలన్నీ అయ్యి, విద్యుత్ సరఫరా చేసే సమయానికి యూనిట్ కరెంటు రేటు మూడింతలు పెరిగి, తడిసి మోపెడు అయ్యింది. ఈ కరెంటు కోసం రాష్ట్రప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఎల్)తో ఒప్పందం చేసుకొని యుద్ధప్రాతిపదికగా వార్థా-నిజామాబాద్ 765 కెవి డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ కారిడార్‌ను నిర్మించారు. తొలుత వెయ్యి మెగావాట్ల కరెంటు కోసం ఈ కారిడార్‌ను బుక్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర అవసరాల పేరుతో మరో వెయ్యి మెగావాట్ల కోసం కారిడార్‌ను 12 ఏండ్ల కోసం దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నారు. కారిడార్ నిర్మాణం పూర్తయ్యి, రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరగాల్సిన సమయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం యూనిట్‌రేటును అమాంతం పెంచేసింది. దీనితో బహిరంగమార్కెట్‌కంటే ధర అధికంగా ఉందంటూ ఆ విద్యుత్‌ను నామమాత్రంగా తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ అధికారులు భావించారు. ఈ సందర్భంగా వెయ్యి మెగావాట్ల కారిడార్ తమకు అవసరం లేదంటూ పీజీసీఎల్‌కు లేఖ రాసారు. కారిడార్ కోసం వేలకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన పీజీసీఎల్ దీనిపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సిఈఆర్సీ)ని ఆశ్రయించింది. విద్యుత్ సరఫరా లైన్లను బుక్‌చేసుకుని వదులుకున్న సంస్థలు, కంపెనీల నుంచి వసూలు చేయాల్సిన పరిహారం విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సిఈఆర్సీ) గతేడాది మార్చి 8న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం 12 ఏండ్ల కాలానికి సంబంధించి 66 శాతం ట్రాన్స్‌మిషన్ చార్జీలు రూ. 250.17 కోట్లు, నోటీసు కాలానికి సంబంధించిన రూ.11.14 కోట్లు కలిపి మొత్తం రూ. 261.31 కోట్లను చెల్లించాలంటూ తెలంగాణ రాష్ట్ర దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు పీజీసీఎల్ నోటీసులు జారీ చేసింది. 12 ఏండ్లకు కారిడార్ బుక్ చేసుకొని, కనీసం ఒక్కరోజు కూడా వినియోగించుకోకుండా వదులుకున్నందుకు గానూ ఈ నష్టపరిహారాన్ని పీజీసీఎల్ కోరింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్పిలేట్‌కు వెళ్లినా, ఒప్పందంలోని షరతులన్నీ పగడ్బందీగా ఉన్నందున ఆ సొమ్ము చెల్లించకతప్పదని టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.