విజయవాడ సెప్టెంబర్ 19,
ఏపీలో అధికార వైసీపీ.. కేంద్రంలో అధికార బీజేపీ రెండు చోట్ల ప్రతిపక్షాలుగా చెప్పుకుంటాయి. ఏపీలో బీజేపీ నేతలైతే టీడీపీతో ఎంత దూరమో వైసీపీతో అంతే దూరమని చెప్తారు. వైసీపీ నేతలైతే బీజేపీ మాకు ప్రతిపక్షమేనని చెప్తారు. కానీ ఏపీ ఎంపీలు మాత్రం కేంద్రంలో బీజేపీ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చే బిల్లులకు ఓటేసి ఆమోదిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలోని మిత్ర పక్షాల ఎంపీలు వ్యతిరేకించినా వైసీపీ ఎంపీలు మాత్రం ఆ నిర్ణయాలకు జైకొట్టి ఓటేసి ఆ నిర్ణయాన్ని గెలిపిస్తారు.. బిల్లును ఆమోదిస్తారు. గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు ఆమోదం తెలపగా ఇప్పుడు ఏకంగా ఎన్డీఏలోని పార్టీలు వ్యతిరేకిస్తున్న బిల్లులకు సైతం ఆమోదం తెలపడం విడ్డురంగా మారింది. అంతేకాదు ఆ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలపై బీజేపీ తరపున వైసీపీ నేతలు వకాల్తా పుచ్చుకొని మరీ వెనకేసుకురావడం మరింత ఆశ్చర్యం కలిగించకమానదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యవసాయ సవరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై చాలా రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉండగా ఈ బిల్లుతో రైతులకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా బిల్లు కూడా పాస్ చేశారు. ఇక ఏపీలో మాత్రం కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు అనుకూలంగా ఇప్పటికే జీవోలు కూడా ఇచ్చేశారు. అందులో భాగంగానే వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు రాష్ట్ర వైసీపీ నేతలు ఒక్క మాట మాట్లాడకపోగా అనుకూలంగా వ్యాఖ్యలు కూడా మొదలు పెట్టారు. కాగా, కేంద్రంలో ఈ బిల్లుకు నిరసనగ ఎన్డీఏ మిత్రపక్షం అయిన అకాలీదళ్ కు చెందిన కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ నుంచి వైదొలిగేందుకు కూడా ఆలోచిస్తున్నామని ప్రకటించారు. అకాలీదళ్ ఎన్డీఏకు కీలక భాగస్వామి పార్టీ. అలాంటి పార్టీ తమ సొంతరాష్ట్రమైన పంజాబ్ లో రైతులకు నష్టం జరుగుతుందని పదవి వదులుకొని కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించగా ఏపీలో రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుండి ఆదేశాలు వచ్చి రాకముందే అమలు చేయాలని జీవో ఇవ్వడాన్ని ఆశ్చర్యం అనుకోవాలో.. విడ్డురం అనాలో.. అన్నిటికి మించి మరేదైనా భయమే అనుకోవాలో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి!