విజయవాడ, సెప్టెంబర్ 19,
జగన్, బీజేపీ..ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం ఏంటో అర్ధం కాదు, సోము వీర్రాజు ప్రెసిడెంట్ అయ్యాక జగన్ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉంటారని అంతా అనుకున్నారు. ఆయన టార్గెట్ కూడా చంద్రబాబేనని చెప్పేశాక ఇక జగన్ తో హానీమూనే అనుకున్నారు. కానీ జరుగుతున్నది వేరు. గత కొన్ని రోజులుగా ఏపీలో వైసీపీ బీజేపీల మధ్యనే రాజకీయ యుద్ధం సాగుతోంది. అది కూడా మతపరమైన వివాదాలతో బీజేపీ రోడ్డు ఎక్కుతూంటే అడ్డుకుంటూ వైసీపీ కమల రధాన్ని కదలకుండా చేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన వారికి ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అనిపించకమానదు, అంతే కాదు, జగన్ కి కంట్లో నలుసుగా మారి పోరు పెట్టేది కూడా కాషాయదళమే అని కూడా అంటున్నారు.జగన్ కూడా ఏ మాత్రం మొహమాటపడడంలేదు. సోము వీర్రాజు నుంచి బీజేపీ కీలక నేతలను ఇప్పటికి రెండు సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కమలం నేతలను అడ్డుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. శాంతిభద్రతల పేరిట ఏపీలో బీజేపీని కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేస్తున్నారు. దాంతో బీజేపీకి వైసీపీకి మధ్య అగాధం పెరిగిపోతోంది. ఏపీలో నియంత పాలన అంటూ బీజేపీ నేతలు కత్తులు నూరుతున్నారు. ఎవరేమి అనుకున్నా ఏపీలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందేనని జగన్ గట్టిగా డిసైడ్ అయిపోయారు. ఆ రెచ్చగొట్టుడు ధోరణితో బీజేపీ నేతలకు కూడా కొత్త పట్టుదలలు వచ్చేస్తున్నాయి. వారు సైతం కట్టు తెంచుకుని మరీ దూసుకువస్తున్నారు.ఇక కేంద్రంలోని మోడీకి ఏ ఇబ్బందీ రాకుండానే జగన్ గొడుగు పట్టుకుంటున్నారు. మోడీకి ఇపుడు లోక్ సభలోనూ ఆపద్భాంధవుడుగా జగన్ అవతరించారు. కేంద్రం రాష్ట్రాల అధికారాలు కత్తిరించే పనిలో బిజీగా ఉన్నా కూడా జగన్ సై అంటున్నారు. ఇలా మోడీకి తనకు మించిన నేస్తం లేదని కూడా చెప్పుకుంటున్నారు. మోడీ కళ్లలో ఆనందం కోసం పరితపిస్తున్నారు. ఏపీలో బీజేపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్న జగన్ మోడీకి మాత్రం ఏ టెన్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి దీన్ని ఏమనాలో కూడా రెండు పార్టీలకూ అర్ధం కావడంలేదు.ఏపీలో టీడీపీ సౌండ్ ఇపుడు ఎక్కడా కనిపించడంలేదు. సోము వీర్రాజు వచ్చాక చలో అంతర్వేది అన్నారు, చలో అమలాపురం అన్నారు. ఇక జిల్లాల టూర్లు చేస్తూ జోరు పెంచారు. చక్కగా కార్యవర్గాన్ని కూడా పార్టీలో వేసి కీలకమైన నాయకులకు పదవులు పంచారు. వారికి బాధ్యతలు గుర్తుచేస్తూ ఆందోళనలోకి దించుతున్నారు. దీన్ని చూసిన వారికి ఏపీలో బీజేపీయే జగన్ కి సరైన ప్రత్యర్ధి అన్న భావన కలుగుతోంది. జగన్ కూడా వారిని అరెస్ట్ చేస్తూ ఎక్కడలేని మీడియా ఫోకస్ ని బీజేపీకి వచ్చేలా చూస్తున్నారు. మరి దీని వెనక ఏమైనా రాజకీయం ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. జగన్ ఇలా రెడ్ కార్పెట్ పరచి మరీ ఏపీలో కయ్యం పేరిట నెత్తిన పాలు పోస్తూంటే ఎదగాలనుకుంటున్న బీజేపీకి పోయేదేముంది, హ్యాపీగా ఉంటోంది. మొత్తానికి జగన్ బీజేపీల మధ్య ఏ అవగాహన ఉందో తెలియదు కానీ ఇక్కడ కయ్యం, అక్కడ వియ్యం అన్నట్లుగా తీరు ఉంది. కానీ అటూ ఇటూ తిరిగి చంద్రబాబే టార్గెట్ గా రెండు పార్టీల వ్యూహాలు సాగుతుండడమే అసలైన ట్విస్ట్.