న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదని.. గతంలో కూడా టీటీడీకి ఎవరూ డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు లేవని కూడా చెప్పారు. ఈ విషయంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్‌పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం ఎందుకు చేయలేదు.. అని ఆయన ప్రశ్నించారు. సెక్యులర్ వాదిగా సీఎం జగన్ సంతకం చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. నిబంధనలు సరిగా అమలు పరచని టీటీడీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని..తిరుమలలో ఆలయ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి రఘురాజు సూచించారు. ‘ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులు ఇన్వెస్ట్ చేయడం సరికాదు. దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు. అమ్మ ఒడి డబ్బు నాన్న బుడ్డికి వెళ్లిపోతోంది. ముగ్గురి కోసం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. నాపై అనర్హత వేటు సాధ్యం కాదు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. వైసీపీ ఎంపీలు న్యాయవ్యవస్థను కించపరచడం సరికాదు. న్యాయ వ్యవస్థ వైపే నేను ఉంటాను. నాకు బెదిరింపులు, కేసులు, అనర్హత వేటుకు సంబంధించి ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశాను’ అని రఘు రాజు చెప్పుకొచ్చారు.