వేదాలకు పునాది అనాది ప్రణవనాదం. లోకాలన్నీ ప్రణవంనుంచే ప్రభవించాయంటారు. పరమేశ్వరుడు ప్రణవ మంత్రాసీనుడై భాసిస్తుంటాడని, సంసార సముద్రాన్ని దాటించగల ఏకైకనాదం ప్రణవమని చెబుతారు.
'ఓంకారం ఎప్పటికీ నశించని నాదం. ఓంకారమే ఈ సకల విశ్వం. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఓంకారమే. కాల తీరాలకు ఆవల కూడా నిత్యమై ధ్వనించేది ఓంకారమే. ఈ విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపమే. మనలోని పరమాత్మ ప్రణవనాదమే' అని మాండూక్యోపనిషత్తు విస్పష్టంగా ప్రవచించింది.
ఆద్య మంత్రం ఓంకారం బ్రహ్మానికి ప్రతీక. ఓంకారంపై ధ్యానం చేస్తే అంతిమ సత్య సాక్షాత్కారం సాధ్యమవుతుందని పెద్దల మాట. ప్రణవ ధ్యానం ఒక అవిచ్ఛిన్న కాంతిధారగా పరాత్పరుడివైపు ప్రసరిస్తుంది. ఓంకారాన్ని జపించడంవల్ల మృణ్మయ శరీర భూమిక నుంచి ఆత్మ పరమోన్నత లక్ష్యంవైపు ప్రయాణిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు.
ఒకసారి 'ప్రణవ మంత్రానికి అర్థం నాకు తెలియదు' అని బ్రహ్మ అన్నప్పుడు అక్కడే ఉన్న షణ్ముఖుడు ఆయన్ని కటకటాల వెనక బంధించాడు. తనకు వేదాల్లోని జ్ఞానమంతా తెలుసు, కాని ప్రణవ మంత్రానికి పరిపూర్ణ అర్థం తెలియదని బ్రహ్మ అన్నాడు సవినయంగా. మహోన్నత జ్ఞానసిద్ధిని పొందినవారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు కొంతవరకు.
బ్రహ్మను కారాగారంలో బంధించి షణ్ముఖుడు సృష్టి చేయడానికి ఉపక్రమిస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని వారించి, ఎక్కువ కాలం బ్రహ్మను కారాగారంలో ఉంచరాదని, విడుదల చేయాలని నచ్చజెప్పాడు. 'కారాగారం గోడల మధ్య ఎలాంటి భావాలు నీకు కలిగాయి' అని శివుడు బ్రహ్మను అడుగుతాడు. కారాగారం తపస్సు చేయడానికి అనువైన చోటుగా భావించానని బ్రహ్మ సమాధానం ఇస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని 'ప్రణవమంటే అర్థం ఏమిటో నువ్వు చెప్పు' అని అడుగుతాడు. 'నీకు రహస్యంగా చెవిలో చెబుతాను' అని షణ్ముఖుడు అంటాడు.
'ప్రణవం మహిమ వర్ణనాతీతం. కర్మబంధాల నుంచి విముక్తం పొందడానికే ఆత్మలు భూమిపై జన్మలు ఎత్తుతున్నాయి. ఈ జీవన చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. చివరికి భగవంతుణ్ని తెలుసుకుని ముక్తి పొందేవారు జీవులు. దైవం ప్రణయానంతరం సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు, ఓంకారం వినిపిస్తుందంటారు. సమస్త దేవతలకు, లోకాలకు, ఆత్మలకు మూలం ప్రణవమే!'
ప్రణవనాద సుధారసమే భువనమోహనమైన రామావతారమై దిగివచ్చిందని త్యాగయ్య గానం చేశాడు. 'నాదాల్లో ప్రణవనాదాన్ని నేను' అని శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు. గణపతి ఓంకార రూపంతో ప్రకాశిస్తాడు. 'ప్రణవమే ధనుస్సు. ఆత్మే బాణం. బ్రహ్మమే లక్ష్యం. గురి తప్పకుండా ఆత్మ లక్ష్యాన్ని చేరాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి' అని ఒక ఉపనిషత్తు గానం చేసింది.
భూమాత గర్భంనుంచి, తల్లి గర్భం నుంచి జన్మించానని భావిస్తున్న జీవాత్మ మొదట పరమాత్మనుంచే ప్రభవించింది. ఆత్మ ఆది ప్రణవమే. అది నిత్య కాంతి ధామం. యుగాల పరిణామం అనంతరం అటువైపే ఆత్మ మహాప్రస్థానం.