భయం మనిషిని ఉద్విగ్నభరితుణ్ని చేసే తీవ్ర మనోవికారం. భయం మనిషితోపాటే పుడుతుంది. చిన్నప్పుడు బూచాడు వస్తాడని అమ్మ చెప్పినప్పుడు భయపడే బిడ్డ భయాన్ని వెంట పెట్టుకుని జీవయాత్ర ప్రారంభిస్తాడు. చదువుకునే చిన్న వయసులో అధ్యాపకులు దండిస్తారనీ, అల్లరి చేష్టలకు తల్లిదండ్రులు కోపిస్తారనీ భయపడుతూ యుక్తవయస్కుడవుతాడు. తానేమిటో సమాజానికి వ్యక్తంచేస్తూ ప్రాపంచిక అనుభవాలతో పరిణతి చెందుతాడు. కడదాకా వెన్నంటి నడిచే మృత్యుభయం దీపం కింద నీడలా ఓ తప్పనిసరి క్రతువని తెలుసుకుంటాడు. భయమనే కంగాళీ వలయంలో మనిషి ఇమిడిపోతూ బతుకు చిత్రం దర్శిస్తూ సాగించే జీవయాత్ర ఎన్నో విచిత్రాల మేళవింపు.
ప్రతి వ్యక్తీ తాను పరిపూర్ణుడననీ, తాను చేసేవేవీ తప్పులు కావనీ భావిస్తాడు. చిత్రంగా ఇతరుల దోషాలే అతడికి కనబడతాయి. ఎవరినీ తప్పుపట్టలేని సందర్భంలో విధిని తూలనాడటం మనిషి దౌర్బల్యం. భయం మూలాలు అతడి కర్మల్లోనే ఉంటాయి. కామక్రోధాది శత్రువర్గంతోపాటు అంతటి ప్రభావవంతమైన శత్రువు భయమే. తన చేతల వల్లే కర్మఫలం సంప్రాప్తిస్తుందని మరచే మనిషి, కష్టాలు దరిచేరినప్పుడు దైవంపైనా నింద వేస్తాడు. అది చిత్రమైన ప్రవర్తన. మానవుడు తనలో ఉండే కామక్రోధాది ఆరుగురు శత్రువులు దాడి చేయకుండా ఓర్పుతో, నేర్పుతో జీవించే ప్రయత్నం చేయాలి. అటువంటి సత్ప్రయత్నాన్నే సాధన అంటారు.
భయాన్నుంచి రక్షించగల ఏకైక ఆపన్నహస్తం ఆధ్మాత్మిక శక్తే. ఆధ్యాత్మిక సాధనవల్ల భయం దూరమవుతుందని మన ప్రాచీన రుషులు సూత్రీకరించారు. పరమాత్మను జపధ్యానాలతో అంతర్ముఖుని చేసుకున్నప్పుడు ప్రాపంచిక భయాలు మనిషిపై పట్టు కోల్పోతాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలవల్ల లౌకిక వాంఛల ఉద్ధృతీ తగ్గుతుంది. సాధారణంగా ఉన్నది కోల్పోతానేమోననీ, కోరుకున్నది దొరకదేమోననీ మనిషి భయపడతాడు. తనను రక్షించేది ఆత్మశక్తే అని తెలుసుకున్న మరుక్షణం, మనిషి చింత చాలావరకు దూరమవుతుంది.
ఒక సాధకుడు ధ్యాన సాధన కోసం జనవాహినికి దూరంగా వెళ్లాలనుకున్నాడు. అడవిమార్గం గుండా ప్రయాణించి ఓ పల్లెకు చేరుకున్నాడు. ఒక పాడుబడ్డ పూరింటిని ఆశ్రయించి వస్త్రం పరచుకుని ధ్యానానికి ఉపక్రమించాడు. అంతలో, 'చిరుత... చిరుత వస్తోంది!' అంటూ ఎవరివో అరుపులు దూరంగా వినిపించాయి. సాధకుడు అప్రమత్తుడై తడక తలుపు వేసి లోపల గడియ పెట్టుకున్నాడు. అలా చేస్తే తడక తోసుకొని చిరుత లోపలికి ప్రవేశించలేదని అతడి విశ్వాసం. కొద్ది క్షణాలయ్యాక అతడిలో వివేకం జాగృతమైంది. ఆత్మసాధనకు అడ్డంకిగా ఉన్న అవరోధాలను అధిగమించడానికి ఇంతదూరం వచ్చి చిరుత దాడి చేస్తుందేమోనని భయపడి ఆత్మరక్షణ కోసం తలుపు మూసిపెట్టడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించుకున్నాడు. వెంటనే తలుపు తెరిచాడు. వెలుపలికి వచ్చి నిశ్చింతగా ధ్యానసాధన కొనసాగించాడు. కొంచెం సేపయ్యాక చిరుత అటు రానే వచ్చింది. ధ్యాననిమగ్నుడై ఉన్న సాధకుడి ముఖంలోకి చాలాసేపు తదేకంగా చూసి వెనుదిరిగి అక్కడినుంచి వెళ్లిపోయింది.
మనసు కల్పించే మహా మాయ 'భయం!' సాధన క్రమంలో భ్రాంతుల మాయాజాలం నుంచి బయటపడి భయాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి. 'దేనికీ భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికిరాకుండా పోతారు... ఈ ప్రపంచంలో దుఃఖానికి మూలకారణం భయమే. నిర్భయత్వమే మనకు స్వర్గాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం' అన్న స్వామి వివేకానంద పలుకులు సదా స్మరణీయం.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో