విశాఖపట్టణం సెప్టెంబర్ 21,
వైసీపీకి అదో మోజు ఉండిపోయింది. విశాఖ వంటి మెగా సిటీని పట్టాలని, ఎవరూ కొట్టని సూపర్ పొలిటికల్ హిట్ కొట్టాలని వైసీపీ ఆశ. 2014 ఎన్నికల్లో అది తీరలేదు. ఏకంగా జగన్ తల్లి విజయమ్మనే జనం ఓడించారు. అలా ఇలా కాదు లక్ష ఓట్ల తేడాతో తిప్పికొట్టారు. ఆ తరువాత 2019 ఎన్నికల వేళ జగన్ ప్రభంజనం ఏపీ అంతటా వీచింది. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో కూడా జగన్ ఊడ్చేసారు. కానీ విశాఖ సిటీ మళ్ళీ మొండిచేయి ఇచ్చేసింది. ఇక్కడ ఉన్న నాలుగు దిక్కులకూ టీడీపీయే దిక్కు అయింది. ఇలా టీడీపీ విశాఖ మెగా సిటీలో మకుటం లేని మహారాజు అయింది. దాంతో వైసీపీ డీలా పడాల్సివచ్చింది.నిజానికి విశాఖ రాజధాని ప్రకటించాక తొలి బోణీగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తారని అంతా భావించారు. ఆయన చేరిక ఖాయం అని నెల క్రితమే గట్టిగా వినిపించింది. కానీ ఆయన శిష్యులు ఇపుడు వరసగా వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారు. గంటా మాత్రం ఎక్కడా సౌండ్ చేయడంలేదు. ఆయన రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్న విజయసాయిరెడ్డి ఇతర నాయకులను మాత్రం తామే దగ్గరుండి మరీ వీరిని తీసుకెళ్ళి జగన్ చేత దీవెనలు ఇప్పిస్తున్నారు. అలా తొలి బోణీ కొట్టి వైసీపీ జెండాను విశాఖ పట్టిన నేతగా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిలిచిపోతున్నారు.మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ చాలా ఏళ్ళు డిఫెన్స్ లో పనిచేశారు. మాజీ సైనికుడిగా ఉంటూ విశాఖలో అనేక సామాజిక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. 2009 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ నుంచి పరాజయం తప్పలేదు. ఇక 2014, 2019 ఎన్నికల్లో ఆయన అసలు వెనక్కి చూసుకోలేదు. జనంలో పెంచుకున్న బలంతో ఎవరు ప్రత్యర్ధి అయినా గెలిచేశారు. సొంత పార్టీలో నేతలు సహకరించకపోయినా కూడా వాసుపల్లి తనకు జనం బలం ఉందని నిరూపించుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నేతగా, చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న వాసుపల్లి గణేష్ ఇలా హఠాత్తుగా సైకిల్ దిగిపోతారని చంద్రబాబు కూడా అనుకోలేదని అంటారు. నిబద్ధత కలిగిన ఆయన టీడీపీని వీడడం ఆ పార్టీకి తీరని నష్టం అయితే వైసీపీకి సిటీలో కొత్త బలం సమకూరినట్లు అయింది.విశాఖవాసులు ఎవరూ రాజధానిని కోరుకోవడంలేదు అన్నది చంద్రబాబు మాట. మరి రెండున్నర లక్షల మంది ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిచిన వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడి జగన్ పక్షాన చేరడం అంటే జనాభిప్రాయం ఏ వైపు ఉందో బాబు అర్ధం చేసుకోవాలని అంటున్నారు. జై విశాఖ అన్న వాసుపల్లి గణేష గొంతుక ఇపుడు బాబుకు రీ సౌండ్ గా వినిపించాలని కూడా చెబుతున్నారు. విశాఖ రాజధాని మాకు కావాలి అంటూ ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు టీడీపీని వీడి వెళ్లారు, ఇంకా మరికొందరు ఆ జాబితాలో ఉన్నారు. దాంతో బాబు తన అమరావతి నినాదాన్ని వీడకపోతే కొంప కొల్లేరే అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా సరైన సమయంలో వాసుపల్లి గణేష్ చేరిక వైసీపీకి గట్టి బూస్టప్ ఇచ్చినట్లు అయిందని ఆ పార్టీ నాయకులు హుషార్ చేస్తున్నారు.