YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మంత్రివర్గ విస్తరణపై…మీమాంసా

మంత్రివర్గ విస్తరణపై…మీమాంసా

బెంగ‌ళూర్, సెప్టెంబ‌ర్ 21,
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుకున్నది ఏదీ అనుకున్నట్లుగా జరగడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నారన్న మాటే కాని యడ్యూరప్ప మాట చెల్లుబాటు కావడం లేదు. ఎన్నడూ లేనిది యడ్యూరప్ప పార్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన మాటే చెల్లాలన్నది యడ్యూరప్ప మనస్తత్వం. అయితే అది మొన్నటి వరకూ. కర్ణాటకలో యడ్యూరప్ప చెప్పినట్లే జరిగేది. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. యడ్యూరప్పకు ధీటుగా వ్యూహాలు రచించేవారు కర్ణాటక బీజేపీలో లెక్కకు మించి ఉన్నారు.దీనికితోడు యడ్యూరప్పకు కేంద్ర నాయకత్వం కూడా సహకరించడం లేదు. ఒకరకంగా ఆయన మాటను పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత యడ్యూరప్ప ఈ సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాను తిరిగి ముఖ్యమంత్రిని కావడానికి సహకరించిన వారికి పదవులు కట్టబెట్టాలన్నా వీలుపడటం లేదు. ఉప ఎన్నికల్లో తాను పట్టుబట్టి సాధించుకున్న సీట్లను గెలిపించుకున్నా తనకు అధిష్టానం సహకరించడం లేదని యడ్యూరప్ప వాపోతున్నారు.కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంది. ఆరు మంత్రి పదవులను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. గత మంత్రి వర్గ విస్తరణలోనూ యడ్యూరప్ప మాట చెల్లుబాటు కాలేదు. ఈసారి తనకు సహకరించిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలని యడ్యూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ శంకర్, ఎం.టి.బి. నాగరాజ్, హెచ్. విశ్వనాధ్ లను మంత్రి పదవుల కోసమే యడ్యూరప్ప ఎమ్మెల్సీలను చేశారు. వీరంతా తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించిన వారే. కానీ అధిష్టానం మాత్రం ఇంకా మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.కరోనా కారణంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేకపోతున్నామని యడ్యూరప్ప ఇప్పటి వరకూ నచ్చచెబుతున్నా వారి నుంచి రోజురోజుకూ వత్తిడి పెరుగుతోంది. దీంతో త్వరగా మంత్రి వర్గాన్ని విస్తరించాలని యడ్యూరప్ప డిసైడ్ అయ్యారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ కూడా మంత్రి పదవుల విషయంలో ఒక జాబితాను కేంద్రనాయకత్వానికి పంపింది. దీంతో యడ్యూరప్ప కేంద్ర నాయకత్వంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో అందరినీ కలసి విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడంతో పాటు తాను అనుకున్న వారికి మంత్రి పదవులు ఇప్పించుకోవాలన్న ఉద్దేశ్యంలో యడ్యూరప్ప ఉన్నారు.

Related Posts