హైద్రాబాద్, సెప్టెంబర్ 21,
విజయశాంతి ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. గత పార్లమెంటు ఎన్నికల తర్వాత తిరిగి విజయశాంతి సైలెంట్ అయిపోయారు. అయితే ఆమె ప్రస్తుతం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూజలు పూర్తి అయిన తర్వాత తిరిగి విజయశాంతి యాక్టివ్ అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయశాంతి రాజకీయాల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. మంచి కథనం, పాత్ర దొరికితే సినిమాలవైపే ఆమె మొగ్గు చూపుతున్నారు.విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే విజయశాంతి ఇప్పటి వరకూ గాంధీ భవన్ కు అడుగుపెట్టలేదు. ఇటీవల దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. విజయశాంతి మెదక్ పార్లమెంటుకు గతంలో ప్రాతినిధ్యం వహించారు. పైగా ప్రచార కమిటీ ఛైర్మన్ కూడా. అయినా విజయశాంతి ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.విజయశాంతి ఎప్పుడూ అంతే. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. ఆమె అసలు గాంధీ భవన్ నేతలను లెక్క చేయరు. ఏదైనా పని ఉంటే నేరుగా ఢిల్లీ వెళ్లి హైకమాండ్ ను కలుస్తారు. ఇక్కడి నేతలతో కూడా టచ్ లో ఉండరు. అంతేకాకుండా ఎన్నికల సమయంలోనే విజయశాంతి జనంలో కన్పిస్తారు. 2018 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఊహించిన విజయశాంతి ప్రచారంలో బాగానే పాల్గొన్నారు. కానీ చిత్తుగా ఓడిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు.ఇక పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారానికి బాగానే తిరిగినా కాంగ్రెస్ బీజేపీ కంటే తక్కువ స్థానాలను దక్కించుకోవడం, విజయశాంతి ప్రచారం చేసిన చోట పార్టీ ఓటమి పాలు కావడంతో ఆమె గాంధీభవన్ వైపు అప్పటి నుంచి కన్నెత్తి చూడటం లేదు. అయితే దీనిపై మెదక్ జిల్లా నేతలు నేరుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆమె ప్రస్తుతం ప్రత్యేక పూజలో ఉన్నారని, పూర్తికాగానే యాక్టివ్ అవుతారని ఉత్తమ్ నేతలకు సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద విజయశాంతి చేసే ప్రత్యేక పూజలేంటనేది ఆసక్తికరంగా మారింది.