విశాఖపట్టణం, సెప్టెంబర్ 22,
స్వాములు అంటే కోరిక కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవాలు. శిల లాంటి దేవుడికి, మానవులకు మధ్యన దూతలు. అందుకే పలకని, ఉలకని దేవుడి కంటే స్వాములను నమ్ముకోవడం బెటర్ అని చాలా మంది అనుకుంటారు. రాజకీయ జీవులైతే స్వాములకు మొక్కుతారు. వారి కరుణ కోసం ఎంతైనా చేస్తారు. ఇక విశాఖలో శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామీజీ సామాన్య భక్తులకు, రాజకీయ నాయకులకు కూడా ఇలవేలుపుగానే ఉంటూ వస్తున్నారు. జగన్ కి దాదాపు అయిదారేళ్ళుగా స్వరూపానందేంద్ర స్వామీజీ తో పరిచయాలు ఉన్నాయి. స్వామి కూడా మా జగన్ అంటూ ఎప్పటికపుడు ఆశీర్వదిస్తూంటారు.స్వరూపానందేంద్ర స్వామీజీ ప్రతీ ఏటా నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షల కోసం రుషీ కేశ్ వెళ్తారు. ఆ సమయంలో విశాఖలో ఆయన ఆశ్రమం సందడి చేయకుండా స్తబ్దుగా ఉంటుంది. ఈసారి అలా స్వామీజీ వెళ్ళగానే ఈ మధ్యలో ఏపీలో ఎన్నో పరిణామాలు జరిగిపోయాయి. ప్రత్యేకించి చూస్తే హిందూమతం మీద తమకే అన్ని రకాల కాపీరైట్స్ తమకే ఉన్నాయంటూ బీజేపీ ఒక లెవెల్లో ఆందోళనలు మొదలెట్టేసింది. ఇక ఈ మధ్యలోనే హిందూ ఆలయాల మీద దాడులు కూడా జరిగాయి. రాజకీయంగా కూడా చాలా సమీకరణలు మారాయి. ఇవన్నీ ఎందుకంటే స్వామి ముహూర్తాలు వైసీపీ బాగా నమ్ముతుంది కాబట్టి. ఇపుడు వైసీపీ సర్కార్ కి కానీ జగన్ కి కానీ కొంత చెడ్డ రోజులు నడుస్తున్నాయా అన్న సందేహాలు కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నాయట.ఇక మూడు రాజధానుల ముచ్చట కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. మూడు రాజధానులు చట్టం చేయడం జరిగింది.కానీ కోర్టులో కేసులు పడ్డాయి. దాంతో అలా ఆగింది. ఇక స్వరూపానందేంద్ర స్వామీజీ విజయదశమికి దివ్యమైన ముహూర్తం పెట్టారు అన్న ప్రచారం అయితే సాగింది. మరి స్వామి ముహూర్తానికి విశాఖకు రాజధాని తరలివస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. ఈ నేపధ్యంలో స్వామి దీక్షను ముగించుకుని రావడంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాస రాష్ట్రం నుంచి స్వామి ఏపీకి వచ్చి అందుబాటులో ఉంటారు కనుక ఒక రకమైన నిబ్బరం వారిలో కనిపిస్తోందిట. ఇక స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు మంత్రి అవంతి శ్రీనివాసరావు తీసుకున్నారు కూడా.స్వరూపానందేంద్ర స్వామీజీ వస్తూనే జగన్ అంతర్వేది రధం దగ్దం మీద సీబీఐ విచారణ జరిపించడాన్ని స్వాగతించారు. ఆ విధంగా ఆయన జగన్ కి తన శుభాశ్సీస్సులు అందించారు. అదే విధంగా టీటీడీ ఆసుల మీద కాగ్ తో ఆడిట్ జరిపించడానికి కూడా వైసీపీ సర్కార్ సిద్ధపడడాన్ని కూడా ఆయన మెచ్చుకున్నారు. ఇలా జగన్ ఇపుడు హిందూ వ్యతిరేకిగా విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్ కార్యక్రమాలను కొనియాడి కొండంత అండగా నిలిచారు. ఇక స్వామి రుషీకేశ్ లో ఉండగానే జగన్ బాబాయ్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. ఇపుడు ఆయన స్వరాష్ట్రంలోనే పూర్తిగా ఉంటారు కాబట్టి ఆయన మూడు రాజధానుల విషయంలో కానీ జగన్ సర్కార్ ఎదుర్కొంటున్న ఒడుదుడుకుల విషయంలో కానీ తనదైన సలహా సూచనలు ఏవైనా రాజ గురువు హోదాలో ఇస్తారా అని వైసీపీలో చర్చగా ఉంది. విశాఖకు రాజధానితో పాటు, జగన్నికూడా రప్పించేందుకు స్వామీజీ ఏమైనా యాగం చేస్తారా అన్న చర్చ కూడా ఉందిట. చూడాలి మరి.