న్యూఢిల్లీ సెప్టెంబర్ 22
ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి నవంబర్ 30 వరకు యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మిషన్లు రద్దు చేసుకున్న, వలస వెళ్లిన విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై మరింత భారం పడకూడ-దన్న ఉద్దేశంతో ఈ ఒక్కసారికి ప్రత్యేకంగా ఈ మేరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి ఏడాది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ అకడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన యూజీసీ మార్గదర్శకాల మేరకు కమిటీ సమర్పించిన నివేదికను కమిషన్ అంగీకరించిందని రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. దీంతో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మిషన్లు నవంబర్ 30 వరకు రద్దు చేసుకునే విద్యార్థులు, వలసవెళ్లిన విద్యార్థులు వారు చెల్లించిన ఫీజులు తిరిగి పొందుతారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.