‘‘అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితంచయత్*
*స్వాధ్యాయాభ్యసనంచైవ, వాఙ్మయం తపఉచ్యతే’’*
ఇతరులకు నొప్పి కలిగించనివి, సత్యములైనవి, హితమైనవి అయిన మాటలనే పలకడం, వేదాధ్యయనం చేయడం.. ఇట్టి వానిని వాక్కు చేత చేయతగిన తపస్సుగా చెప్పింది భగవద్గీత. మానవజీవితం ఆనంద భరితం కావాలంటే మంచివాక్కు ఎంతైనా అవసరం. ఎదుటి మనిషి మీద మంచో-చెడో ఒక అభిప్రాయం కలగడానికి కారణం మాటే. మాట్లాడటంలో సమతుల్యత, సంయమనం ఉంటే ఆ మాటే మంత్రం అవుతుంది. నాలుక అదుపులో లేకపోతే ఆధ్యాత్మిక సాధనలన్నీ వ్యర్థమే. నాలుక మనకు రెండు పనుల కోసం ఇవ్వబడింది. మొదటిది దేహాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కావలసిన ఆహారాన్ని రుచి చూసి ఆరగించడానికి, రెండవది నిరంతరం భగవన్నామాన్ని జపించడానికి. నాలుకను నియంత్రించినవారికి.. మిగిలిన జ్ఞానేంద్రియాల్ని కూడా నియంత్రించడం వీలుపడుతుంది. ‘‘కః పరః ప్రియ వాదినామ్’’ ..ఎదుటి వారికి ఇష్టమయ్యే విధంగా మాట్లాడే వారికి శత్రువులుండరని దీనర్థం.
*‘సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్’*
అనివేదం బోధిస్తుంది. నాలుక సంయమనాన్ని కోల్పోతే మానవుడు శారీరకంగానూ మానసికంగానూ క్షీణించి, నశిస్తాడని ప్రజ్ఞాపురాణం చెబుతుంది. సత్యపూరితమైన మాటలకు సహజంగానే ఒక మహత్తు ఉంటుందని చెప్పాలి. అలసట, విసుగు పుట్టించే ఏ భౌతిక చర్య కన్నా కూడా సూటిపోటి మాటలు ఎక్కువ బాధ, ఒత్తిడి కలిగిస్తాయి. ప్రియమైన వచనం ఎప్పుడూ ‘అమృతధార’ లాగా అంతఃసుఖమునిస్తుంది. నాలుక ఎవని వశంలో వుంటుందో, లోకమంతా వానికి వశమై ఉంటుంది.
*లోక వార్తానుగమనే జిహ్వాప్యేకు సహస్రధా*
*ఈశ వార్తాను గమనే, ద్వాత్రింశద్దంత కీలితా’’*
అనగా ‘‘లౌకిక విషయములు గూర్చి పలుకునప్పుడు నాలుక ఒకటియే వేయి ముఖములుగా విజృంభిస్తుంది. అదే భగవంతుని గూర్చి పలుకవలెనన్నచో ముప్పది రెండు పళ్ళ మధ్య దాగుకొని ఉంటుంది. అందుచేతనే వివేకులు తమ నాలుకను పొడిగించు అలవాటు మానుకుంటారు. మంచి మాటలు చంద్రుని కన్న, చందన రసంకన్న, చల్లని నీటి కన్న, చెట్టు నీడకన్న కూడా మనసును ఆహ్లాదపరుస్తాయనేది నిత్య జీవితంలో... నిత్యసత్యమే కదా! అందుకే భర్తృహరి కూడా ‘‘వాగ్భూషణం భూషణమ్’’ అని తెలిపాడు.
ఓం శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వరాయ నమః
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో