విశాఖపట్టణం, సెప్టెంబర్ 23,
ఉత్తరాంధ్ర టీడీపీలో చిత్రమైన పరిస్థితి ఉంది. అసలే పార్టీ అంతకంతకు కుంచించుకుపోతోంది. రోజుకొక ఎమ్మెల్యే పేరు వైసీపీతో కలిపి వినిపిస్తోంది. ఎన్నడూ పార్టీ లైన్ దాటని వాసుపల్లి గణేష్ కుమార్ హఠాత్తుగా జై జగన్ అనేశారు. దాంతో ఎంతమంది సైకిల్ దిగుతారో తెలియడంలేదు. ఈ నేపధ్యానికి తోడు ఉత్తరాంధ్రాలో అంతకంతకు వైసీపీ స్ట్రాంగ్ అవుతోంది. బీసీలను ఒడిసిపట్టుకుంటోంది. దాంతో టీడీపీ పునాదులు కదులుతున్నాయి. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తరాంధ్రా బీసీకి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అచ్చెన్నాయుడికి ఆ పదవి కట్టబెట్టాలని కూడా భావిస్తున్నారు.ఇక టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ అని చెప్పుకుంటున్న అయ్యన్నపాత్రుడు అనూహ్యంగా సీన్ లోకి దూసుకువచ్చేశారు. ఆయన డైలీ జగన్ని టార్గెట్ చేస్తున్నారు. మంత్రి గారు బెంజి కారు అంటూ ఏపీలో ఈ మధ్యనే మెరుపు షాట్లతో ఆధికార పార్టీని బెంబేలెత్తించారు. ఏపీలో టీడీపీని జగన్ ఏమీ చేయలేరని తాజాగా భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ పాలన మీద ఆయన హాట్ కామెంట్స్ చేస్తూ కంట్లో నలుసుగా మారారు. ఇలా అయ్యన్న యాక్టివ్ కావడమే కాదు, చంద్రబాబు కంటే డైనమిక్ గా మారుతున్నారు. పార్టీ ఆఫీస్ కి వచ్చి మరీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు.ఇవన్నీ చూస్తూంటే అయ్యన్నపాత్రుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి. అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు తో పాటే అయ్యన్న టీడీపీలో సైకిల్ ప్రయాణం మొదలెట్టారు. పైగా పది వరకూ కీలకమైన మంత్రిత్వ శాఖలు చూసి అనేకసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. మాటల తూటాలు పేల్చడంతో అయ్యన్న తరువాతే ఎవరైనా అంటారు. ఆయనకు జంకూ గొంకూలేదు. ఆయన మాటల దాడికి చంద్రబాబే ఒక్కోసారి వెనక్కి తగ్గుతారు. అటువంటి ఫైర్ బ్రాండ్ కి కీలకమైన వేళ పదవి ఇస్తే బాగుతుందన్న ఇంప్రెషన్ అయితే పార్టీలో తెచ్చుకున్నారు. బయటకు నోరు విప్పడంలేదు కానీ తాను రేసులో ఉన్నాను అని బాబుకు అయ్యన్న సంకేతాలు బాగా పంపుతున్నారుట.
ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీరు చూస్తే అయ్యన్నకు భిన్నంగా ఉంది. ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇస్తామని బాబు అనధికారికంగా హామీ ఇచ్చినా కూడా ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పినదిలేదు. ఆయన బెయిల్ మీద వచ్చిన తరువాత తన ఇంటికే పరిమితం అయ్యారని టాక్. తన సొంత నియోజకవర్గం టెక్కలిలో వైసీపీ దూసుకెళ్తోంది, దాంతో అక్కడ పట్టు నిలుపుకునేందుకే అచ్చెన్న అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు. మరో వైపు ఆయనకు ఈ పదవి మీద అంతలా ఆసక్తి లేదని అంటున్నారు. దీంతోనే అయ్యన్నపాత్రుడు తాను రెడీ అంటున్నారుట. మరి చంద్రబాబు అయ్యన్నకు ఆ పదవి ఇచ్చి తట్టుకోగలరా అన్నదే పెద్ద ప్రశ్న. అచ్చెన్న అయితే బాబు తరువాత తాను అంటారు. కానీ అయ్యన్న మాత్రం తానే సీనియర్ అంటూ దూసుకొస్తే అపుడేంటి అన్న డౌట్ తోనే బాబు ఆలోచిస్తున్నారుట. ఏది ఏమైనా అచ్చెన్న నో చెబితే మాత్రం అయ్యన్నే బాబుకు దిక్కు అయ్యేలా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.