ఆర్థిక శాఖ, ఇతర శాఖల పరస్పర సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్)లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సూచించారు. సచివాలయం 5 బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పనితీరు, ప్రాధమికంగా తలెత్తే సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖలలో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలో పరిష్కరిస్తారని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నాటికి అన్ని శాఖల వారు డేటాను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. శాఖల మధ్య పరస్పర సహకారంతో సమస్యలను అధిగమించాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి శాఖాధిపతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయమని సీఎస్ కోరారు.
ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టిన ఈ నూతన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు 90 శాతం డేటా అప్ లోడ్ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ వల్ల ఉపయోగాలు, డేటాకు రక్షణ, నిర్వహణాసౌలభ్య, డేటా అప్ లోడ్, వివిధ మాడ్యుల్స్, బిల్లుల చెల్లింపు మొదలైన అనేక అంశాలను వారు వివరించారు. ప్రభుత్వంలోని 78 శాఖల బడ్జెట్, లావాదేవీలు, వివిధ పథకాలకు సంబంధించి బిల్లుల చెల్లింపులు, 4,22,972 మంది ఉద్యోగులు, 3,55,618 మంది సెన్షనర్లకు సంబంధించిన లావాదేవీలు జాప్యంలేకుడా జరగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డేటా అప్ లోడ్, బిల్లుల చెల్లింపులు, యూజర్ నేమ్, పాస్ వర్డ్ వంటి సమస్యలతోపాటు శాఖాధిపతులు అడిగిన వివిధ ప్రశ్నలకు అర్థిక శాఖ అధికారులు సమాధానాలు చెప్పారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. సచివాలయంలోని ఒక్కో బ్లాక్ కు ఒక్కో సీఎఫ్ఎంఎస్ సెల్ ఏర్పాటు చేయమని అడుగగా, అందుకు సీఎస్ అంగీకరించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలమాదారు జె.సత్యనారాయణ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎల్.వి.సుబ్రహ్మణ్యం, జెఎస్ వి ప్రసాద్, ఆదిత్యనాధ్ దాస్, డాక్టర్ డి.సాంబశివరావు, బి. రాజశేఖర్, ముద్దాడ రవిచంద్ర, ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, జి.అనంతరాము, షంషేర్ సింగ్ రావత్, పూనమ్ మాలకొండయ్య, కెఎస్ జవహర్ రెడ్డి, కార్యదర్శులు నాగులాపల్లి శ్రీకాంత్, శశిభూషణ్ కుమార్, బి. రామాంజనేయులు, హేమా మునివెంకటప్ప, మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, దేవాదాయ కమిషనర్ వైవి అనురాధ, ఏపీ సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ వి.రామమనోహర్ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.