విజయవాడ, సెప్టెంబర్ 24,
రాజకీయాల్లో అంతా తాము అనుకున్నట్లే జరగవు. అంతా తమకు అనుకూలంగానే ఉండదు. కానీ సమయానికి తగు రీతిలో అన్నట్లు వ్యవహరించాల్సి ఉంటుంది. మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు అమరావతి సెగ బాగా తగులుతున్నట్లు చెబుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ పై సామాజిక పరంగా వత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అందుకే వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారంటున్నారు.వసంత కృష్ణ ప్రసాద్ మొన్నటి ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న ఉమామహేశ్వరరావును ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. వసంత కృష్ణ ప్రసాద్ గెలుపులో కమ్మ సామాజికవర్గం ప్రధాన పాత్ర పోషించిందని చెప్పాలి. దేవినేని ఉమ ఏకపక్ష వైఖరిని నచ్చని కొందరు కమ్మ సామాజికవర్గం నేతలు వసంత కృష్ణ ప్రసాద్ వెంట నడిచి ఆయన గెలుపునకు కారణమయ్యారు.అయితే రాజధాని అమరావతి తరలింపులో ఇప్పుడు ఆ సామాజికవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు వసంతను వదిలేసి తిరిగి దేవినేని ఉమ వైపునకు వెళ్లి అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం వారిని ఏమాత్రం కన్విన్స్ చేయలేకపోతున్నారు. గతంలోనే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది.అమరావతి రాజధాని తరలింపుతో ఎక్కువ నష్టపోయేది తానేనని వసంత కృష్ణప్రసాద్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాజధాని అమరావతి అంశం తప్పించి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ అన్ని విషయాల్లో దేవినేని ఉమ కంటే మెరుగ్గానే పనితీరు కనబరుస్తున్నారంటున్నారు. మరో వైపు గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసి బిల్లులు పొందని వారు కూడా వసంత కృష్ణ ప్రసాద్ పై వత్తిడి తెస్తున్నారట. దీంతో ఆయన అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద వసంత కృష్ణ ప్రసాద్ సొంత సామాజికవర్గం నుంచి తీవ్రమైన వత్తిడి ఎదుర్కొంటున్నారు.