విజయవాడ, సెప్టెంబర్ 24,
ఈయన పూర్వపరాలు అన్నీ కూడా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ మధ్యనే చెప్పేశారు. కాబట్టి ఆ జోలికి పోనవసరం లేదు, ఇక రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలిచారు. నందమూరి ఫ్యామిలీ అంటే ప్రాణమైనా ఇస్తారు. అటువంటి కొడాలి నాని జగన్ జైలు గోడల మధ్య ఉన్నపుడు స్వయంగా వెళ్ళి మరీ కలిసారు. జై జగన్ అంటూ వైసీపీలో చేరిపోయారు. ఇదంతా 2012 నాటి మాట. ఆ తరువాత కొడాలి నాని వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన సీనియారిటీని చూసి ఇచ్చారో లేక తన పట్ల విధేయతను చూసి మెచ్చారో కానీ జగన్ ఆయన్ని మంత్రిని చేశారు. ఎమ్మెల్యేగానే కొడాలి నాని అప్పట్లో దూకుడుగా మాట్లాడేవారు. ఇపుడు బాధ్యతాయుతమైన మంత్రి పోస్టులో ఉండి కూడా నోటి వెంట అవే ఆణిముత్యాలను జాలువార్చుతున్నారు.ఇంతకీ కొడాలి నానికి దేవుడి మీద భక్తి ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఆయన తిరుపతి వెంకన్నను మొక్కుతారు. గుండు కూడా చేసుకుంటారు. కొడాలి నాని అసలు పేరులోనే వెంకటేశ్వరస్వామి ఉన్నారు. ఇక ఆయన తిరుపతి అయినా మరో కోవెలకు అయినా ఎందుకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నది విగ్రహమే కదా. ఇదే కదా కొడాలి నాని చెబుతుంది. ఆంజనేయుడి విగ్రహానికి చేయి విరిగితే మరోటి చేయిస్తాం, అంతర్వేది రధం దహనం అయితే మరోటి వస్తుంది. దీనికెందుకు ఇంత గొడవ అంటూ సరికొత్త భాష్యకారుడిగా కొడాలి నాని ప్రవచనాలు చెబుతున్నారు. అంటే ఆయన దేవుళ్ళను కేవలం విగ్రహంగానే చూస్తున్నాబీజేపీ మాట్లాడింది, జనసేన పోట్లాడింది, చంద్రబాబు నిలదీశారు అని కాదు ఇక్కడ. వీరి మాటలకు అందని సెంటిమెంట్ భక్తులకు ఉంది. ఒక ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టుకుని ఉదయాన్నే దండం పెట్టి కానీ బయటకు రాని జనాభా నూటికి తొంబై శాతం ఉన్న దేశం మనది, దేవుడు ఎక్కడ లేడు అని కొడాలి నాని మాదిరిగా విశ్వవ్యాప్తమైన భావన చిన్న బుర్రలకు ఎక్కించుకోలేని అమాయక జనం ఉన్న దేశం మనది. ఇంట్లో దేవుడి క్యాలండర్ ఉంటే దానికి ఎదురుగా కాళ్ళు కూడా జాపడానికి భయపడే మూఢ భక్తులు ఉన్న దేశం మనది. అలాంటిది రధం కాలిపోతే అది కలపే కదా, హనుమాన్ విగ్రహం సిమెంట్ తో చేసిందే కదా అని నాస్తికవాదం కబుర్లు కొడాలి నాని చెబుతూంటే తిక్కరేగేది బీజేపీకి కాదు, మండిపోయేది హిందూభక్తులకే.కొడాలి నానికి పూర్వాశ్రమం వాసనలు ఇంకా పోలేదుగా ఉంది. అందుకే తెల్లారుతూనే చంద్రబాబుని పట్టుకుని తిడుతూ ఆయనకు ప్రచారం మీడియాలో బాగా తెచ్చిపెడతారు. అంతేనా బాబు ఏదైతే కోరుకుంటున్నారో అదే తాను చేసి చూపించి పసుపు రాజకీయాన్ని పచ్చగా పండిస్తారు. జగన్ కి మేలు చేస్తున్నాను అనుకుంటూనే బాబు ట్రాప్ లో నిలువునా కొడాలి నాని పడిపోతున్నారు. కొడాలి నాని తాజాగా చేసిన కామెంట్స్ వైసీపీకి అతి భారీ నష్టం కలిగించాయి. జగన్ కి కొడాలి నాని మాటల దూకుడు, బాబు మీద సెటైర్లు నచ్చుతాయేమో కానీ ఆస్థిక జనులు మాత్రం నాని హిందూ దేవాలయాల గురించి, అక్కడ సంప్రదాయాల గురించి చాలా తేలిక చేసి మాట్లాడడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంతకాలం బీజేపీ, టీడీపీ వంటివి ఎగస్ట్రాలు చేస్తున్నాయని నమ్మే జనాలు కూడా కొడాలి నాని కొడవలి వేటుకు వైసీపీ మీద పూర్తిగా బరస్ట్ అవుతున్నారు. ఇప్పటికైనా నానిని అదుపులో ఉంచేలా జగన్ చర్యలు తీసుకోకపోతే ఆయన ఎంచక్కా జగన్ని దింపేసి బాబుని తిరిగి సీఎం సీట్లో కూర్చేబెట్టేలా ఇక్కడ నుంచే చేయాల్సిన మేలు అంతా చేస్తాడు. మరి ఆలోచించుకోవాల్సింది జగనే