గుంటూరు, సెప్టెంబర్ 24,
రాజకీయాలు ఎపుడూ మారుతూ ఉంటాయి. అలా మారుతూ ఉంటేనే రాజకీయం అని కూడా అంటారు. ఎప్పటికపుడు వాటిని గమనిస్తూ దానికి తగినట్లుగా ప్రణాళిక వేసుకున్న వారే ఎక్కువ కాలం అధికారంలో మనగలుగుతారు. ఏపీ విషయానికి వస్తే జగన్ పదేళ్ల పారాటానికి ముఖ్యమంత్రి సీటు వచ్చింది. నిజానికి సీఎం సీట్లో కూర్చోవాలని జగన్ కి ఎంత ఆశ ఉందో తెలియదు కానీ అంతకు రెట్టింపు ఆయన్ని అభిమానించే జనాలకు కోరిక అయితే ఉంది. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున వారి సంబరం అంబరాన్నే తాకింది. ఇదిలా ఉంటే జగన్ నెమ్మదిగా ఏడాదిన్నర పాలన పూర్తి చేశారు. ఇపుడు అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి.జగన్ వల్ల అన్ని రకాల ప్రయోజనాలూ కేంద్రంలోని బీజేపీ పొందుతోంది. ఏపీలో మాత్రం ఆయన్ని ఫక్త్ హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని రాజకీయం చేసి మతం కార్డు తో కాషాయం పార్టీ ముందుకు వస్తోంది. తాజాగా నిన్న అంతర్వేది రధం దహనం హాలాహలంగా సాగింది. నేడు కనకదుర్గమ్మ ఆలయ రధం మీద వెండి సింహాలు పోయాయని బీజేపీ యాగీ చేస్తోంది. ఇలా ఒకదాని తరువాత మరోటి అన్నట్లుగా సాగుతున్న హిందూ మతం మీద అపచారాలు చివరికి జగన్ పుట్టె ముంచే అవకాశాలు ఉన్నాయా అని ఏకంగా ఆయన సన్నిహిత మంత్రులే భయపడుతున్నారంటే బీజేపీ జాణతనం అర్ధమవుతోందిగా.ఇక జగన్ ఏపీలో బీజేపీ ఇలా తన కళ్ళ ముందు కర్రలు పెట్టి కదలనీయకుండా చేస్తున్నా కూడా గుడ్డిగా ఎన్డీయేను సమర్ధిస్తున్నారు. ఎన్డీయే బిల్లులు ఎవైనా సరే మొదటి మద్దతుదారు జగనేనని మోడీకి కూడా నమ్మకం కలుగుతోంది అంటే జగన్ ఎంతలా బీజేపీ పక్షంలోకి వెళ్ళిపోయాడో మరి. ఇక కేంద్ర మంత్రి పదవులు తీసుకోకుండా జగన్ ఒక్కటే తప్పు చేస్తున్నాడు తప్ప అన్నీ కూడా ఎన్డీయేలో ఆయన అనధికార భాగస్వామి అన్నట్లుగానే సాగుతున్నాయి. మోడీకి ఇంతలా తలవంచి కేంద్రానికి అండగా ఉంటున్నారు. విద్యుతు సంస్కరణల వంటి వివాదాస్పద బిల్లులకు కూడా జగన్ ఒకే చెబుతున్నారు. ఆఖరుకు తన తండ్రి వైఎస్సార్ ఉచిత విద్యుతు పధకానికి కూడా చిల్లులు పెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు తప్ప బీజేపీ బాటను విడిచిపెట్టడంలేదు.ఈ పరిణామాలు జగన్ రాజకీయానికే ముప్పు తెచ్చిపెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో మొత్తం ముస్లిం సమాజంలో నూటికి ఎనభై శాతం పైగా జగన్ పార్టీకే 2019 ఎన్నికల్లో ఓటు చేసారు. ఇక 2014 ఎన్నికల్లో కూడా వారు వైసీపీనే అనుసరించారు. వైఎస్సార్ కాలం నుంచి ముస్లిం సమాజం వారి కుటుంబానికి అండగా ఉంటూ వస్తోంది. మరి అటువంటి ముస్లిం వర్గాల మనోభావాలను సైతం గమనించకుండా జగన్ కేంద్రంలోని బీజేపీతో అంటకాగడం ద్వారా ఏం బావుకుంటున్నారు అన్నదే ప్రశ్నగా ఉంది. జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ భయంతోనే ఆయన అలా చేస్తున్నారు అని ఓ వైపు చంద్రబాబు అంటున్నారు. జగన్ అలా కాదు అని చెప్పాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారనో, నిధులు దండీగా తెచ్చామనో చెప్పి బీజేపీ సర్కార్ కి మద్దతు ఇస్తే బాగుండేది. ఏమీ కండిషన్లు పెట్టకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ ని జగన్ మోయడం ద్వారా ముస్లిం లు మద్దతుని పెద్ద ఎత్తున కోల్పోతున్నారని అంటున్నారు. మరి ఇకనైనా జగన్ జాగ్రత్త పడకపోతే ఏపీలో అటు హిందువులు, ఇటు ముస్లిం వర్గాలు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు ఉన్నాయి.