YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

క‌మ‌లానికి వ‌రుస స‌వాళ్లు

క‌మ‌లానికి వ‌రుస స‌వాళ్లు

హైద్రాబాద్, సెప్టెంబ‌ర్ 24, 
తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం కావాలని శతథా ప్రయత్నిస్తున్న భారతీయ జనతాపార్టీకి వరుస సవాళ్లు ఎదురు కానున్నాయి.  కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బలోపేతం కావడం నల్లేరు మీద బండి నడకే అన్న విశ్వాసంతో ఉన్న ఆ పార్టీకి రానున్న రోజుల్లో వరుస సవాళ్లు ఎదురు కానున్నాయి. గ్రేటర్ ఎన్నికలు, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, దుబ్బాక ఎన్నిక పార్టీకి సవాళ్లుగా పరిణమించనున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా బలపడి కొన్ని స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీకి మరోసారి అటువంటి విజయాలు దక్కుతాయా అన్నది అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన అగ్రోబిల్లు, ప్రతిపాదిత విద్యుత్ బిల్లుల పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతా రాష్ట్రంలో బీజేపీకి ఒకింత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందని అంటున్నారు.అయితే ఈ బిల్లులు అధికార తెరాస చెబుతున్నట్లుగా రైతులకు శాపం కాదనీ, వరమని ప్రచారం చేస్తూ బీజేపీ...మోడీ హయాంలో రాష్ట్రానికి అందిన నిధుల వివరాలను ప్రజలలో ప్రచారం చేసి ప్రచార పర్వంలో దూకుడు పెంచడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ బిల్లు, తెలంగాణ విమోచనన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ను పెడచెవిన పెట్టడం వంటి అంశాలు కలిసి వస్తాయన్న భావనతో కమలం పార్టీ ఉంది. ఈ ఏడాడి మార్చిలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ హిందూ వాదాన్ని బలంగా వినిపించడం ద్వారా పార్టీని ప్రజలకు చేరువ చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రానున్న ఎన్నికలు ఆయనకు అసలు సిసలు పరీక్షగా నిలవనున్నాయి.ఎందుకంటే వరుసగా మూడు రకాల ఎన్నికలలో పార్టీని విజయం దిశగా నడిపించాల్సిన బాధ్యత ఆయన ముందుంది. దుబ్బాక ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. మూడూ కూడా అత్యంత కీలకమైనవే. మూడు ఎన్నికల్లోనూ విజయాన్ని అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో విజయం ద్వారా విశ్వనగరంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది అధిష్టానం ఉద్దేశం. ఆ మేరకు ఇప్పటికే పార్టీ కేడర్ కు కేంద్ర మంత్రి కిషనన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలను కమలం పార్టీ అత్యంత  ప్రతిష్టాత్మంగా తీసుకుంది. విశ్వనగరంలలో పార్టీకి ఏకంగా ఆరుగురు జిల్లలా అధ్యక్షులను నియమించి వికేంద్రీకరణకు బాట వేసింది. గ్రేటర్ను నాలుగు భాగాలుగా విభజించి నలుగురు అధ్యక్షులను నియమించి ఎక్కడికక్కడ క్యాడర్ ను బలోపేతం చేసి వారిలో విజయ కాంక్షను పాదుగొల్పి ఎన్నికల సమరానికి సంసిద్ధులను చేసే బాధ్యత వారికి  అప్పగించింది.బీజేపీ నలువైపులా అధ్యక్షులను నియమించి పార్టీ కార్యకలాపాలను వికేంద్రీకరించింది. హైదరాబాద్‌ జిల్లాను నాలుగు విభాగాలుగా, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను అర్బన్‌, రూరల్‌గా విడదీసి వేర్వేరుగా అధ్యక్షులను నియమించింది. గెలుపు వ్యూహాలను  రచించుకుని  ముందుకు సాగుతున్న  బీజేపీకి అగ్రో బిల్లులు ప్రతిబంధకంగా  మారాయి. ఎందుకంటే  కొత్త రెవెన్యూ  చట్టంతో  గ్రామీణ  రైతాంగానికి ముఖ్యమంత్రి భరోసా ఇస్తే...అగ్రో  బిల్లులతో కేంద్రం రైతుల్లో సంశయాన్ని, భయాన్ని నింపింది. ఈ బిల్లులపై బీజేపీ ప్రజలను ఎలా కన్విన్స్ చేయగలుగుతుందన్న దానిపైనే బీజేపీ  విజయావకాశాలు  ఆధారపడి ఉంటాయి. అందుకే  రానున్న  మూడు ఎన్నికలు  కమలం పార్టీకి  అసలు  సిసలు పరీక్షగా  మారనున్నాయి.

Related Posts