విజయవాడ, సెప్టెంబర్ 24
పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై 2018లో దాడి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఫిబ్రవరి 17న ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారు.. లేఖని ఆమోదిస్తూ ఆగస్ట్ 12న 776 జీవో విడుదలైంది. ఈ అంశంపై తాజాగా గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు సురేష్ కుమార్, ఫణిదత్ చాణక్యలు తమ వాదనలు వినిపించారు.సాక్షాత్తూ పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడిలో పోలీసులు ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని.ఇటువంటి నేరాలు భవిష్యత్తులో పునరావృతం అయ్యేందుకు ఈ జీవో తావిస్తుందని.. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టును కోరారు. జీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవోలోని భాషపైనా న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడాన్ని న్యాయమూర్తులు తప్పుపట్టారు. పిటిషన్‌లో ఎన్ఐఎని కూడా పార్టీగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. సదరు జీవో నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ అక్టోబరు 1వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.