హరిహరసుతుడు ధర్మశాస్తా. ఆయనకున్న ఎన్నో అవతారాలలో ఒకానొక లీలావతారం భువిలో నాయకుడైన ఈ అయ్యప్ప స్వామి.
అయ్యప్ప అన్న నామం పురాణ ఇతిహాసాలలో కనబడకపోవచ్చును. ఎలాగైతే రాముడు కృష్ణుడు శ్రీమన్నారాయణుని అవతారాలో ఒకే శక్తి అవతారాలో అలాగే అయ్యప్పస్వామి వారు కూడా హరిహరసుతుని ఒకానొక అవతారం.
*పురాణాలలో చెప్పబడినది*
బ్రహ్మాండపురాణ అంతర్గత *“భూతనాధోపాఖ్యానము”* అనే గ్రంధంలో శాస్తా అవతారం సంపూర్ణంగా వివరింపబడి వుంది.
భువిలో స్వీకరించిన ఈయన అవతారంలో ఆయన నైష్టిక బ్రహ్మచారి కానీ మహాశాస్తా పూర్ణా, పుష్కలా సమేతునిగా దర్శనమిస్తారు.
శాస్తా భూత పరివారమైన వావరుడు, కటుశబ్దుడు, వీరభద్రుడు, కూపనేత్రుడు, కూపకర్నుడు, కండాకర్ణుడు, మహాబలి అన్న ఏడుగురు వేరు, అయ్యప్ప వావర్ అన్న ఇస్లాం భక్తుడు వేరు.
పురాణకాలానికి, చారిత్ర కాలానికి మధ్య చాలా వ్య్వవధి ఉంది. మహిషిని సంహారం చేసిన సందర్భంగా ఏర్పడినదే శబరగిరి ఆలయం.
పందళ దేశ రాజుకు బిడ్డగా అనుగ్రహింపబడ్డ అయ్యప్ప ఉదయనుడు అన్న కిరాతుని చంపి శిధిలావస్థలో ఉన్న శబరిమలను పునరుద్ధరించి ఆ స్థలంలో ప్రతిష్టింపబడిన విగ్రహంలో ఐక్యం అవ్వడం ఋజువుగా స్వీకరించవలసి వస్తుంది.
నేటి కేరళ ప్రాంతం పరశురాముని భూమి . ఈ ఆలయం కూడా ఆయన ప్రతిష్టింపబడినదే . శబరిమలకు అగ్నిదేవుని శాపం ఉండిన కారణమున నిర్ణీత కాలానికి ఒకసారి ఆలయానికి అగ్నిప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. ఇది కూడా అయ్యప్ప చిత్తమే. అందువలన ఎన్నోమార్లు ఆలయం పునర్నిర్మాణము కావడమూ, విగ్రహ మార్పిడీ జరుగుతున్నది.
క్రీ.పూ. 978వ సంవత్సర చారిత్రిక సంఘటనలో అగ్నిప్రమాదం జరిగిందని ప్రభాకరాచార్యుల వారిచే ప్రతిష్ట జరిగిందని ఆ గుడి తాపడాల మీద శాసనాల ఆధారంగా తెలియవస్తున్నది.
తమిళనాట పలు గ్రామ రక్షకునిగా ఉన్న అయ్యనార్ మహాశాస్తా అని అనడానికి ఏమీ సందేహం లేదు. కామాక్షీ దేవీ కూడా తన పుత్రునిగా శాస్తాను రక్షణాధికారి గా నియమించింది.
అంత వరకు ఎందుకు నడిచే దేవుడు పరమాచార్య వారు అయ్యప్ప పూజా విధిని శాస్తా పూజావిధిగా ఆమోదించారు. ఇక నేటి వారు ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదు కదా.
57 వ కంచి పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ పరశివేంద్ర సరస్వతీ వారు తాము రచించిన సహస్రనామ భాష్యంలో పుత్రిణే నమః అన్న నామానికి గణపతి, స్కంధుడు, మహాశాస్తా అన్న పుత్రులను కన్న తండ్రిగా శివుని కీర్తించారు.
*“మిత్రేయిని”* ఉపనిషత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శాస్తా, ప్రణవం అంతా ఒక్కరే అని చెబుతుంది.
శివసహస్రనామాలలో *“శాస్త్రుపితా”* అన్న నామం పరంజ్యోతి స్వరూపుడైన శాస్తా గురించి ప్రస్తావిస్తున్నది.
కోటిరుద్రసంహితలో ఈశ్వరుడే స్వయంగా శాస్తాను పొగిడారు.
*“లింగపురాణం”* లో నందీశ్వరునితో కుమారస్వామి శాస్తా యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ విష్ణు, శివ పుత్రుని యొక్క గుణగణాలగురించి చెబుతూ అమితపరాక్రమవంతునిగా కీర్తిస్తాడు.
బృహస్పతి విరచితమైన *“బార్హస్ప్యనీత”* లో కుమార పర్వతమున కుమారస్వామి, సహ్యపర్వతమున గణపతి, రైవతక పర్వతమున శాస్తా నిత్యనివాసము చేస్తున్నారని వివరిస్తారు.
*స్కాందపురాణ అంతర్గతమైన శివరహస్యకాండం* లో శాస్తా గురించి ఆయన ప్రభావం గురించి 13 వేల శ్లోకాలు ఉన్నాయి.
*శ్రీ లలితోపాఖ్యానము* లో మోహినిగా వచ్చిన పార్వతి దేవికి శివుని వలన కలిగిన పుత్రునిగా శాస్తా గురించి చెబుతుంది.
కలియుగంలో మానవ మనుగడలో నీతి నిజాయితీకి భంగం వాటిల్లినప్పుడు పందళ రాజుకు పుత్రునిగా అవతార స్వీకారం చేసి తన ఉనికిని తెలిపాడు కానీ ఈ ధర్మశాస్తా నాటికీ, నేటికీ, ఎప్పటికీ మన సాంప్రదాయపు దేవతాస్వరూపుడే.
ఓం శ్రీ స్వామియే.... శరణం అయ్యప్ప
ఓం నీలకంఠతనయనే.... శరణం అయ్యప్ప
ఓం సర్వరోగనివారణ ధన్వంతరమూర్తయే.....శరణం అయ్యప్ప