విజయవాడ, సెప్టెంబర్ 26,
ప్రశ్నిస్తానంటూ.. రాజకీయ అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ప్రశ్నలే మిగులుతున్నాయి. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమరావతి రాజధాని విషయం ఆయనకు ప్రతిబంధకంగానే మారింది. రాజధానికోసం ఉద్యమించిన రైతులకు ఆయన మద్దతు తెలిపారు. ఇంతలోనే బీజేపీతో పొత్తు పెట్టుకుని.. రాజధానిపై మౌనం వహించారు. దీంతో అక్కడి రైతులు, రాజధానిని కోరుతున్న ఓ వర్గం ప్రజలకు ఆయన కంటగింపుగా మారిపోయారు.రాజధాని కావాలంటే.. బీజేపీకి కోపం.. వద్దంటే.. అక్కడి ప్రజలకు కోపం.. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఉక్కిరిబిక్కిరి గురై.. చివరకు దీని నుంచి ఎలాగోలా సైలెంట్ అయితే అయ్యారు. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి. అంతర్వేది రథం దగ్ధం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండి రథం సింహాలు అదృశ్యం కావడం, ఇతర చిన్న చిన్న ఆలయాల్లో.. విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దేవాలయాలపై దాడులను తీవ్రమైనవిగా భావిస్తున్న బీజేపీ నాయకులు ఇప్పటికే ఆయా ఆలయాల్లో సందర్శన చేశారు. ఇక, చలో అమలాపురం యాత్రకు కూడా బీజేపీ ఏపీ సారథి సోము వీర్రాజు పిలుపు నిచ్చారు. మరి ఇంత జరుగుతుంటే.. బీజేపీతో పొత్తుపెట్టుకుని, మీతో కలిసి నడుస్తామని వాగ్దానం చేసిన పవన్ ఏమీ మాట్లాడక పోవడం బీజేపీకి కోపం తెప్పిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అంతర్వేది విషయంలో ఓ ప్కటన జారీ చేసిన పవన్ కళ్యాణ్ విజయవాడ విషయంలో పార్టీ నాయకుడు పోతిన మహేష్‌ను పంపించి అక్కడితో సరిపెట్టారు.కానీ, బీజేపీ మాత్రం ఇది చాలదు! అని ఖచ్చితంగా సంకేతాలు పంపుతోంది. క్షేత్రస్తాయిలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాలని ఒత్తిళ్లు వస్తున్నట్టు జనసేన వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో పవన్ తీవ్రస్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఒత్తిడి మేరకు తాను రోడ్డెక్కితే.. రేపు కొన్ని మతాల వారికి దూరమవుతానేమోనని ఆయనలో ఆవేదన కనిపిస్తోందట. నిజమే. రాజకీయంగా అన్ని వర్గాలు కీలకమైన ఈ రోజుల్లో బీజేపీ లాగా స్టాండ్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ వంటి నాయకులకు ఇష్టం లేదు. అయితే.. అటు బీజేపీని కాదనలేరు.. ఇటు ఒత్తిళ్లను తట్టుకోలేరు.. ఏం చేస్తారో చూడాలి.