YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*కృతజ్ఞత*

*కృతజ్ఞత*

మనిషి సంఘజీవి. అయితే సమాజంలో ఉన్న కొందరు మనుషులు తమంతట తామే సొంతంగా, ఎవరి సహాయం లేకుండానే ఒంటరిగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అటువంటి వారు ఎప్పుడో ఒకప్పుడు ఏదోఒక రూపంలో ఇతరుల సహాయ సహకారాలు తప్పని సరిగా పొందవలసిందే, సహాయం పొందకుండానే ఎవరూ ఎదిగే ప్రసక్తే లేదు. మనం ఒక ప్రమాద కరమైన స్థితిలో ఉన్నప్పుడో, ఏదో ఒక సహాయం మనకు అవసర మైనపుడో, మనం ఇతరులను అడిగితే సహాయ పడేవారు కొందరుంటారు. మనం అడగక పోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదార పురుషులు కూడా కొందరుంటారు. అలాంటి వారికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృజ్ఞత అనేది మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం.
రామాయణంలో వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ , కృతజ్ఞశ్చ” అన్నాడు. అంటే సీతమ్మను అపహరించు కొనిపోతున్న రావణునితో పోరాడి అతడి చేతిలోని ఖడ్గ ఘాతానికి తన రెక్కలు తెగిపోయి ప్రాణం పోయే స్థితిలో ఉన్నను రాముడు వచ్చే వరకు తన ప్రాణాలను బిగబట్టుకొని ఉండి, ఆ సమాచారాన్ని రాముల వారికి చెప్పి ప్రాణాలు విడిచిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమ సంస్కారం తనే స్వయంగా చేశాడు. రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధుర ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, అక్కడి నదులలో నిరంతరం స్వాదు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు ఇంద్రుణ్ణి కోరాడు. అలా ఆయన తనకు సహకరించిన వారిపట్ల తన కృతజ్ఞతా భావాన్ని తెలియజేశాడు_
మహా భారతంలో దగ్ధమైన లాక్షా గృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచు కుంటున్న కుంతి, తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించి ఒక సందర్భంలో “ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం అత్యుత్తమం” అంటుంది.
“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం” అనే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి.
ఒకనాడు మనకు మేలు చేసిన మనిషి, విధివశాత్తూ ఒక కష్టంలో ఉన్నట్టు మనకు తెలిస్తే అతని యందు సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించక పోతే అది 'కృతఘ్నత ' అవుతుంది.
ఈ విషయాన్ని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు వివరించాడు.
ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం " తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. పువ్వులతో, కాయలతో పండ్లతో పచ్చని ఆకులతో పచ్చగా ఉన్న ఆవృక్షం విష శరాఘాతం వల్ల నిలువునా మాడి మసై పోయింది.
ఆ చెట్టే ఆశ్రయంగా, దానితొర్రలో నివాసముంటున్న ఒక పక్షి ఆ చెట్టును వదలలేక కూలిపోయిన ఆ చెట్టు మీదనే ఉండిపోయింది. దీనిని గమనించిన ఇంద్రుడు మారు వేషంలో దాని దగ్గరకు వెళ్ళి.. "ఓ పక్షి రాజమా ఈ వృక్షం పనికి రానిదై పోయింది. ఫలసంపదగల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో చాలానే ఉండగా, నీవు ఇంకా దీనినే అంటి పెట్టుకునే ఎందుకున్నావు" అని అడిగాడు. అందుకు ఆ పక్షి "ఈ చెట్టు తాను మధుర ఫలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది. ఈ వేళ ఇది ఎండిపోయిందని నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా అనిమిషనాథా! " అంది.
తాను మానుష రూపంలో వచ్చినా "పురాకృత సంజనిత విశేషము" చేతనే ఈ పక్షి రాజం తనను ఇంద్రునిగా పోల్చుకో గలిగిందని ఆశ్చర్య పోయి.. "నీ మాటలకు మెచ్చాను, నీకేంకావాలో కోరుకో " అన్నాడు ఇంద్రుడు. అపుడా పక్షి "ఈ వృక్షానికి తిరిగి ప్రాణం పోయండి చాలు " అంది. ఇంద్రుడు సంతోషించి అమృత సేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు. ఈ కథవల్ల ఉత్తములైన ఆశ్రితులు, ఆశ్రయ దాత క్షేమాన్ని కోరుకోవాలనీ, అలా చూపే కృతజ్ఞత ఉత్తమ లక్షణమనీ తెలియజేస్తోంది.
సజ్జనులు ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోరు.. దీన్నే కృతజ్ఞత అంటారు....

Related Posts