చెన్నై, సెప్టెంబరు 26
గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. తిరుమళ్లూరు జిల్లాలోని తామరైపాక్కంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో శైవ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు జరిగాయి. అంతకుముందు కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం వైదిక క్రతువులు పూర్తి చేశారు. ఆయనను కూర్చోబెట్టి ఖననం చేశారు.లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఉన్న తన రెడ్ హిల్స్ ఫామ్‌హౌస్‌లో పూర్తి పోలీసు గౌరవ వందనంతో జరిగాయి. గత యాభై ఏళ్లుగా భారతీయ సినిమా, సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ గాయకుడిని 72 గన్ల సెల్యూట్ తో తమిళనాడు పోలీసులు సత్కరించారు.బాలు అంత్యక్రియలకు హాజరైన వారిలో నటుడు విజయ్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, గాయకుడు మనో, సంగీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్, హాస్యనటుడు మాయిల్సామి ఉన్నారు.
పాటల పూదోటలో పుట్టి.. సుస్వర సంగీత మాలికలల్లి .. గాన సరస్వతి కంఠాని కలంకరించి .. సుమధుర గానాంభృతపు జల్లులు కురిపించిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గంధర్వ లోకానికి పయనయమయ్యారు.అశృనయనాల మధ్య బాలు అంత్యక్రియలకు భారీగా అభిమానులు తరలి వచ్చి కడసారి వీడ్కోలు పలికారు. ఫామ్ హౌజ్ అభిమాన సంద్రంగా మారింది.