నెల్లూరు సెప్టెంబరు 26
నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రముఖ గాయకులు యస్.పి. బాలసుబ్రహ్మణ్యంకి నివాళులర్పించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు ఇతర నాయకులు. సింహపురి ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మనకు దూరం కావడం సంగీత ప్రియులను, సాహిత్య ప్రియులను మరింత కలిచివేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం ఆగిపోయిన భౌతికంగా మనకు దూరమైనా మరణం లేని మధుర గాయకుడిగా ఆయన ఆలపించిన గీతాలతో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం నాలుగు దశాబ్దాలపాటు సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా వెలుగొంది, గంభీరంగా నిష్క్రమించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక భాషలలో 40 వేల పైచిలుకు పాటలు పాడి సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించాడు. నెల్లూరు జిల్లా వాసిగా, నెల్లూరు జిల్లా పై, జిల్లా ప్రజల పై ఎంతో ప్రేమాభిమానాలు చూపించే ఎస్పీ బాలు మనల్ని వదిలి వెళ్ళిపోవడంతో గత జ్ఞాపకాలను తలుచుకొని జిల్లా ప్రజలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం కేవలం గాయకుడిగానే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా అనేక రకాల బాధ్యతలను తన జీవిత కాలంలో సమర్థవంతంగా నిర్వహించారు. ఎస్పీ బాలు గారు కేవలం పాటలకు, సంగీతానికి పరిమితం కాకుండా అనేక సందర్భాలలో ఆయన ఇచ్చిన సందేశాలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆయనకున్న అవగాహన చెప్పనలవి కాదు. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి కలగాలని ఆయన లేని లోటును తట్టుకొని ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నివాళులు అర్పించారు.