హైద్రాబాద్ , సెప్టెంబర్ 26
మన బాలు ఘనత విశ్వవ్యాప్తమైందనడానికి నిన్న ఆయన మరణవార్తను ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ న్యూస్ చానల్లో ప్రసారం చేయడమే నిదర్శనం. సాధారణంగా అంతర్జాతీయ వ్యవహారాలకే ప్రాధాన్యత ఇచ్చే బీబీసీ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్తకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక న్యూస్ బులెటిన్ ప్రసారం చేసింది. సీనియర్ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని, ఆయన్ను అందరూ ఎస్పీబీ అని పిలుచుకుంటారని బీబీసీ యాంకర్ వార్తలు చదివారు.74 ఏళ్ల వయసున్న బాలు దక్షిణ భారత సినీ రంగంలో ఎంతో పేరుప్రఖ్యాతులు అందుకున్నారని, ఆగస్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వివరించారు. తన 50 ఏళ్ల కెరీర్ లో డజనుకు పైగా భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం బాలు మృతికి సంతాపం తెలిపారని వెల్లడించారు. అంతేకాదు, బాలు మృతిపై లైవ్ లో అభిప్రాయాలు కూడా అడిగారు. కాగా, ఈ వీడియోను టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ లో పంచుకున్నారు