ఏపీలో రాజకీయ వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు సాగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే గుంటూరు, విజయవాడల్లో జగన్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నుంచి నేతలు వైసీపీలోకి చేరారు. జగన్ తో పార్టీ కండువాలు వేయించుకుని వీళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో నేత కూడా వైఎస్సార్సీపీ బాటపడుతున్నాడని తెలుస్తోంది.ఆయన మరెవరో కాదు.. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించి, గత ఎన్నికల అనంతరం రామనారాయణ రెడ్డి తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరఫున వీరికి ఎమ్మెల్సీ హామీ లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు. ఒక దశలో రామనారాయణరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వనున్నారనే మాట కూడా వినిపించింది.అయితే అది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో చర్చలు జరుగుతున్నాయని.. వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రామనారాయణ రెడ్డిని పోటీ చేయించాలని వైఎస్సార్సీపీ భావిస్తోందని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడ నుంచి రామనారాయణ రెడ్డి వెళ్లిపోయారని, తన కార్యాలయం నుంచి కూడా చంద్రబాబు ఫొటోలను ఆయన తీసేయించారని... వైసీపీలోకి ఈయన చేరిపోవడం ఇక లాంఛనమే అని ప్రచారం సాగుతోంది.
పార్టీ మారతారనుకోవడం లేదు
అయితే ఆన్ బ్రదర్స్ విషయమై..మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఆనం రాంనారాయణ రెడ్డి వైసీపీలో చేరుతున్నారని తాము అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆయన పార్టీలోనే కొనసాగుతారని, అందులో అనుమానం అవసరం లేదని అన్నారు. కాగా, మరోవైపు అనారోగ్య కారణంతో ఆనం వివేకానందరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతోన్న విషయం విదితమే.