YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క్షేత్ర సందర్శనం బోయకొండ గంగమ్మ, పుంగనూరు.

క్షేత్ర సందర్శనం బోయకొండ గంగమ్మ, పుంగనూరు.

బోయ కొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం; కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటి కన్న ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ అలయం ఒక చిన్న కొండపై వెలసి ఉంది. ఇక్కడ నిత్య పూజలు జరుగు తున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
నవాబులు పాలన సమయములో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ధ్యేయంతో తమసేనలతో దండయాత్రలు చేస్తూ అక్కడి జమిందారులను, పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేస్తున్న సమయమది. పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై నవాబుల కన్నుపడింది.
గోల్కొండ నవాబు సైన్యాలు పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలు పెట్టారు. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరువైపు వస్తున్న నవాబు పదాతి దశాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివశించే బోయల, ఏకిల గూడేలలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఎందరో మహిళలు బలాత్కారానికి గురయ్యారు. పౌరుషంతో ఎదుర్కొన్న అనేకమంది బలయ్యారు. నవాబుసేనలు కూడా హతమయ్యారు.
మరలా గోల్కొండనుండి విస్తృతసేన పుంగనూరు చేరింది. ఈ విషయం తెలుసుకొన్న బోయలు, ఏకల దొరలు కొండ గుట్టకు వెళ్లి జగజ్జనిని ప్రార్థించారు. వీరి మొర ఆలకించి శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గ ధాటికి రాతి రాళ్లు సైతం నిట్టనిలువుగా చీలిపోయాయి.. (ఇప్పటికి కొండపై నిట్టనిలువుగా చీలి కనిపించే అతి పెద్ద రాయిని మనం దర్శించవచ్చు.) నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు ఒక మేకపోతును బలియిచ్చి తమతోపాటు ఉండమని ప్రార్థించారు.
వారి కోరిక మేరకు వెలసిన అమ్మవారిని "దొరబోయకొండ గంగమ్మ"గా పిలవడం అలవాటైంది. కొండపైన హిందువులు కట్టుకొన్న సిర్తారి కోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టక్రింద అమ్మ నీరు త్రాగిన స్థలం గుర్తులు రాళ్లకు సైన్యం గుర్తులు, ఉయ్యాల ఊగిన రాళ్లు అమ్మవారి మహిమలను శాశ్వత నిదర్శనాలు.
కొండపై వెలసిన అతి సుందరమైన అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మటుమాయమవుతాయని, పంటలపై తీర్థాన్ని చిలకరిస్తే చీడలుతొలగుతాయని దుష్ట సంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.
ఆలయంలో పూజావిధానం అన్ని ఆలయాలలో వున్నట్లే వుంటుంది. కాని భక్తులు ఎక్కువగా జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ చుట్టు ప్రక్కలా చిన్న చిన్న కొండలు, గుట్టల మయం, అంతా చిట్టడవి. సామాన్యంగా భక్తులు అందరూ బృందాలుగా తమ వెంట వంట సామానులు, ఒక ఏటను అనగా ఒక మేక గాని లేదా ఒక గొర్రెను గాని, కనీసం ఒక కోడిని గాని తీసుకొని వస్తారు. వంట సామునులు తేలేని వారికి అన్ని వంట సామానులు ఇక్కడ అద్దెకు ఇస్తారు. గంగమ్మ కొండ దిగువన మేకలను, గొర్రెలను కోసి వంటలు చేసి అక్కడే తిని గంగమ్మను దర్శించుకొని సాయంకాలం తీరిగ్గా ఇళ్లకు వెళ్తారు.
గంగమ్మకు మొక్కిన వారు వాయిదా వేయ కుండా తప్పని సరిగా మొక్కును తీర్చు కుంటారు. లేకుంటే గంగమ్మ ఆగ్రహారానికి గురి కావలసి వస్తుందని భయం. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమంటే ఆలయం లోపల మామూలుగా ప్రసాదాలు ఇస్తుంటారు. ఎక్కడ లేనివిధంగా ఇక్కడ రంగు నీళ్లను కూడా తీర్తం లాగ ఇస్తారు. దాని కొరకు అందరు నీళ్ల బాటిళ్లు తీసుకెళతారు. ఆ నీళ్లను తమ పంట పొలాలలో చల్లితే పంటలకు చీడ పీడలు తగలకుండా మంచి పంట నిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి భక్తులు మన రాష్ట్రం నుండే కాక, సమీపంలో వున్నందున కర్ణాటక, తమిళ నాడు రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు.
బోయకొండ గంగమ్మకు సంతాన కల్పవల్లిగా పేరుంది. దక్షిణ భారతావనిలో ముఖ్యమైన శక్తి క్షేత్రంగా భసిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించ వలసిన క్షేత్రం.
సర్వేజనా సుఖినోభవంతు 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts