తిరుపతి, సెప్టెంబర్ 29,
పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు దాదాపు చేతులు ఎత్తేశారా ? ఇక, ఏమైతే.. అదే అవుతుంది .. అని ఆయన భావిస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాను రాను.. టీడీపీ మరింత పలచనయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే.. అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచింది. గత ఏడాది గెలిచిన నాయకులను వరుస పెట్టి పార్టీలోకి తీసుకుంటోంది. తాజాగా పార్టీకి పట్టున్న విశాఖలో వరుసగా రెండుసార్లు గెలిచిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కూడా పార్టీ వీడడంతో మిగిలిన ఎమ్మెల్యేల్లో కూడా నమ్మకాలు సన్నగిల్లుతోన్న పరిస్థితి. ఈ పరిణామాలను నిలువరించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారా ? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. పార్టీ కోసం పనిచేసేవారు కూడా కనిపించడం లేదు.ఈ క్రమంలో ఇటు గుంటూరు, ప్రకాశం, కోస్తా జిల్లాలు సహా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీలో దూకుడు కనిపిస్తోంది. నిజానికి వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉంది. అయినా కూడా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వచ్చే రోజుల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలో చేరే నేతలు ఎక్కువగా ఉన్నారు. పోనీ.. వీరికి అడ్డుకట్ట వేసేలా.. యువతను ప్రోత్సహించేలా చంద్రబాబు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే అది కనిపించడం లేదు.దీంతో దిగే మెట్లపై నిలబడ్డ నాయకుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. ఇటు కోస్తాలో వైసీపీ ఇలా దూకుడుగా కనిపిస్తుంటే.. అటు.., రాయలసీమ వైపు .. బీజేపీ పావులు కదుపుతోంది. సీమలోని నాలుగు జిల్లాల్లో కర్నూలు, అనంతపురం, కడపలో బీజేపీ నాయకులు, సానుభూతి పరులు ఉన్నారు. పైగా ఆయా జిల్లాల్లో వైసీపీ అంటే గిట్టని వారు కూడా కనిపిస్తారు. ఈ క్రమంలో ఇలాంటి వారిని తన గూటికి చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వీరిలో ఎక్కువమంది కేంద్రంతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు ఉండడం.. బీజేపీకి కలిసివస్తున్న పరిణామం.
రాయలసీమలో పాత టీడీపీ కమ్మ నేతలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, అభిరుచి మధు ఇప్పటికే కాషాయం గూటికి చేరిపోయారు. ఇక ఇదే లిస్టులో అనంతపురం జిల్లాకే చెందిన మాజీ కమ్మ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేరు కూడా వినిపించింది. ఇక చిత్తూరు జిల్లాలోనూ కొందరు కమ్మ టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారట. ఇక రాజధాని జిల్లాల్లోనూ ఇదే వర్గంలో కొందరు నేతలు బీజేపీలోకి వెళితే ఎలా ? ఉంటుందా ? అన్న చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పరిస్థితి ముప్పేట దాడి అన్న విధంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటు వైసీపీ, అటు బీజేపీ.. రెండూ టీడీపీని డైల్యూట్ చేస్తోన్న పరిస్థితే కనిపిస్తోంది