YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముద్ర‌గ‌డ‌... సైలెంట్ అయిపోయారే

ముద్ర‌గ‌డ‌... సైలెంట్ అయిపోయారే

కాకినాడ‌, సెప్టెంబ‌ర్ 29, 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా కాపు ఉద్యమ నేతగా ముద్రగడ మంచి గుర్తింపు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజికవర్గానికి రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ మూడు దశాబ్దాలుగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాల్లో మాత్రమే కాపులకు జరిగిన అన్యాయం గుర్తుకు వస్తుందనే అపప్రదను మూటగట్టుకున్నప్పటికీ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడంలో ముద్రగడ ముద్ర ఉందనడంలో సందేహం లేదు.తుని రైలు దహనం ఘటనతో కాపు రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అప్పటి అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ముద్రగడ ఉద్యమానికి అప్పటి ప్రతిపక్ష వైసీపీ మద్దతు తెలపగా, ఉద్యమాన్ని అణచివేయడానికి అధికార టీడీపీ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే కాపుల అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పది శాతం రిజర్వేషన్‌లో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి టీడీపీ సేఫ్ గేమ్ ఆడగా, కేంద్రం పరిధిలో ఉన్న రిజర్వేషన్లు తమ వల్ల సాధ్యం కాదంటూ వైసీపీ తేల్చి చెప్పింది. ఫలితంగా కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం 2019 ఎన్నికల్లో టీడీపీని అధికారం నుంచి దూరం చేయగా, వైసీపీకి ఊహించని విజయాన్ని అందించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, కాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కన పెట్టింది.ప్రజా సంకల్ప యాత్రలో జగ్గంపేట వేదికగా కాపు రిజర్వేషన్ల అంశం తమ పరిధిలో లేదని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి తెగేసి చెప్పడంతో ముద్రగడ సైలెంట్ అయిపోయారు. సాధ్యం కాదని చెప్పిన వారితో పోరాటం ఎందుకు అనుకున్నారో? ముఖ్యమంత్రి జగన్ మీద ఉన్న అభిమానమో తెలియదు గానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ నోరు మెదప లేదు.రాష్ట్రంలో అన్ని కులాలతో సమానంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లెక్కకట్టి కాపులకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ముద్రగడ మౌనంగా ఉండిపోయారు. దీంతో కొంతమంది కాపు ఉద్యమ నాయకులు మీడియా, సోషల్ మీడియా వేదికగా ముద్రగడపై విమర్శలు చేశారు. కాపు ఉద్యమ సమయంలో సేకరించిన నిధుల విషయంలో కూడా అవకతవకలు జరిగాయంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వినిపించడంతో ఇటీవల కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు. ముద్రగడ ప్రకటనతో షాక్‌కు గురైన కాపు జేఏసీ నాయకులు చలో కిర్లంపూడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.కాపు ఉద్యమానికి ముద్రగడ నాయకత్వం వహించేలా ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేశారు. కోవిడ్ నిబంధనలు కారణంగా చలో కిర్లంపూడి కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ద్వారక తిరుమల వేదికగా సమావేశం అయిన 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు ముద్రగడ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 21న కిర్లంపూడి వెళ్ళి కాపు ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా ముద్రగడను కోరారు. కానీ, కాపు జేఏసీ నాయకుల కోరికను ముద్రగడ సున్నితంగా తిరస్కరించారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నందుకు క్షమాపణలు కోరుతూనే మళ్లీ ఉద్యమంలోకి రావాలంటూ ఇబ్బంది పెట్టవద్దంటూ సూచించారు.ఉద్యమంలోనికి తిరిగి రావడం సాధ్యం కాదని ముద్రగడ చెప్పినప్పటికీ జేఏసీ నాయకుల ఆశలు మాత్రం ఇంకా సజీవంగా కనిపిస్తున్నాయట. జేఏసీ చెప్పిన విషయాలను పరిగణనలోనికి తీసుకుని ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుని కాపు ఉద్యమానికి నేతృత్వం వహిస్తారని కొంతమంది నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన వారసుల రాజకీయ భవిష్యత్ కోసం ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.వైసీపీ లేదా బీజేపీలో చేరడానికే ముద్రగడ ఉద్యమానికి స్వస్తి చెప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో నిర్వహించిన కాపు ఉద్యమంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోయిన ముద్రగడ.. వాటి నుంచి తేరుకోవాలంటే ఉద్యమం నుంచి తప్పుకోవడం ఒక్కటే మార్గమని ఆయన అనుచరుల్లో జరుగుతోన్న చర్చ. సాధ్యం కాదని తేల్చి చెప్పిన వారితో పోరాడే కంటే వారసుల రాజకీయ భవిష్యత్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలనే ఆలోచనలో ముద్రగడ ఉన్నారట.కాపు ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకుంటే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై కూడా చర్చ జోరుగా సాగుతోందట. కాపు ఉద్యమానికి నేతృత్వం వహించడానికి చాలామంది సిద్ధంగా ఉన్నప్పటికీ ముద్రగడ లేని లోటును మాత్రం పూడ్చ లేరని ఆ వర్గాల్లోనే వినిపిస్తున్న టాక్. కాపు ఉద్యమం తారస్థాయికి చేరడానికి ముద్రగడ మొండితనమే కారణమని, అలాంటి నాయకులు ప్రస్తుతానికి ఎవరూ కనిపించడం లేదంటున్నారు. కాబట్టి ఏదో ఒకటి చేసి ముద్రగడనే మళ్లీ ఉద్యమంలోనికి లాగాలని కొంతమంది భావిస్తున్నారట.కాపు కార్పొరేషన్ ఏర్పాటు కానీ, అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించడం, మూడు దశాబ్దాలుగా ముద్రగడ చేసిన పోరాట ఫలితమేనని జేఏసీ నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ముద్రగడను ఎలా ఒప్పిస్తారు? మళ్లీ ఉద్యమంలోనికి ఎలా తీసుకువస్తారు? ఒకవేళ ముద్రగడ నో చెప్తే ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు.
 

Related Posts