విజయవాడ, సెప్టెంబర్ 29,
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో విధ్వంసకాండ ఆగడం లేదు. ఎక్కడో అక్కడ ఏదో ఒక గుడిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడుతున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణం భక్తులను కలచివేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు ఇంద్రకీలాద్రిలో రథానికి ఉన్న నాలుగు వెండి సింహం బొమ్మల్లో మూడు మాయమైన విషయం వెలుగుచూసింది. ఇది ప్రజలను విస్మయానికి గురిచేసింది. సీసీటీవీ ఫుటేజి కూడా15 రోజులకు మించి లేకపోవడంతో సింహం బొమ్మల మాయం మిస్టరీగా మారింది. ఇంకా ఏలేశ్వరంలో ఆంజనేయస్వామి విగ్రహం, నిడమానురులో షిర్డీ సాయిబాబా విగ్రహం ధ్వంసం కూడా భక్తులకు తీరని వేదన మిగిల్చాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆగర మంగళంలోని శివాలయంలో ఉన్న పురాతనమైన నంది విగ్రహాన్ని పగులగొట్టారు. ఈ దారుణం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులను కలవరపరచింది. దోషులను పట్టుకుని శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలని, వీటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. అయితే, ఆలయాల్లో దాడులపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అంతర్వేదిలో రథం తగులబెడితే ప్రభుత్వం కొత్తది చేయిస్తుంది. దాని వల్ల దేవుడికి పోయేదేమీ లేదు. మరి... ఎవరికి ఉపయోగం? ఆంజనేయస్వామికి చెయ్యి విరగ్గొడితే... ఆంజనేయస్వామికి పోయేదేం లేదు... బొమ్మదే! పది కేజీల వెండి ఎత్తుకుపోతే ఆరేడు లక్షల రూపాయలు. దాంతో మేడలు, మిద్దెలు కట్టేదేమీ లేదు. గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు... ఇలా సాగాయి కొడాలి నాని వ్యాఖ్యలు. ఒక బాధ్యతాయుతమైన మంత్రే ఇలా భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా మాట్లాడడం, ఇంకా దుండగుల దాడులు కొనసాగుతుండడంతో ఈ విషయంలో పోతే పోనీ అనే ధోరణికి జగన్ ప్రభుత్వం వచ్చేసిందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.