అదిలాబాద్, సెప్టెంబర్ 29,
ఆదివాసీలపై మావోయిస్టులు దారుణానికి పాల్పడుతున్నారా..! ఇటీవల వారి మీద వస్తున్న వార్తలను చూస్తుంటే అమాయకమైన ప్రజలను ఇన్ఫార్మర్ నెపంతో కఠిన శిక్షలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని దండకారణ్యంలో ఐదు రోజుల వ్యవధిలోనే16 మంది ఆదివాసీలను దారుణంగా హతమార్చారు. నెల వ్యవధిలోనే 20 మందిని పొట్టన పెట్టుకున్నారు. మావోయిస్టులు ఆదివాసీలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరుగట్ల, కోమట్‌పల్లి, జబ్బకట్ట, తెమ్రేలు, సింగం, ధర్మారం తదితర గ్రామాలకు చెందిన 16 మంది ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు, వారిని చిత్ర హింసలకుగురి చేసి హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్న మావోయిస్టులు..ప్రజాకోర్టు పేరిట హత్యలు చేస్తున్నారు. దాదాపు 1500 మందితో ప్రజాకోర్టు నిర్వహించారు. ముందుగా నలుగురు గ్రామస్తులను హత్య చేశారని.. ఆ తర్వాత ఇతర చోట్ల మరో 12 మందిని హత్య చేసినట్లు సమాచారం. ఈనెల మొదటి వారంలో కూడా బీజాపూర్ జిల్లాలోనే 20 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసి వారిలో నలుగురు హతమార్చారు. మిగితా వారిని కొట్టి వదిలేశారు. మావోయిస్టుల ఘటనలతో ఏజన్సీలో భీకర వాతావరణం నెలకొంటోంది