విజయవాడ సెప్టెంబర్ 30,
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు వైసీపీ నేతలకు అంత చులకనైపోయారా? బీజేపీ నాయకులను అంత అలుసుగా చూస్తున్నారా? వైసీపీ నేతలు ఎంతెంత మాటలన్నా బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఎందుకు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు? ఇవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. బీజేపీ నాయకుల్ని కుల, మతపరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా కించపరుస్తున్నారు. బీజేపీ నాయకులు సైలెంట్‌గా ఉండిపోవడం, లేదా ఒక ట్వీట్ చేసి ఊరుకోవడం వైసీసీ నేతలు మరింత రెచ్చిపోవడానికి కారణమవుతోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దుగ్గబాటి పురందేశ్వరిపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయని అంటున్నారు. బీజేపీలో జాతీయ స్థాయి కీలక పదవి చేపట్టిన సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో పార్టీ వైఖరిని పురందేశ్వరి ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. పార్టీ పరంగా రాజధాని అమరావతిలోనే ఉండాలని చెబుతున్నామని, అయితే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని తెలిపారు. కానీ, ఆమెపై కుల ముద్ర వేస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాజధానిగా అమరావతికి అనుకూలంగా మాట్లాడినా... వారిపై కుల ముద్ర వేసేస్తారని వైసీపీపై ఉన్న విమర్శలకు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి. అయితే, ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తేలిగ్గా తీసుకుంటున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పురందేశ్వరి జాతీయ నాయకురాలు కాదని, జాతి నాయకురాలని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె అభిప్రాయాలు చూశాక ఇదే స్పష్టమైందంటూ నోరుపారేసుకున్నారు. అయితే బీజేపీ నాయకులు కిమ్మనకుండా ఉండిపోయారు. సునీల్ ధియోధర్ మాత్రం ట్వీట్ చేసి ఊరుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడని బీజేపీ నేతలను విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారు. బీజేపీలో వైసీపీ అనుకూల గ్రూపును కూడా వదిలిపెట్టడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును, బీజేపీని మంత్రి కొడాలి నాని కించపరచినా పట్టించుకున్నవారు లేరు. బీజేపీ నాయకులకున్న ఈ బలహీనతను చూసి వైసీపీ మరింత పేట్రేగిపోతోందని అంటున్నారు.