తిరుపతి, సెప్టెంబర్ 30,
బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికల అనివార్యమయింది. అయితే తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలు వైసీపీ చేతులోనే ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో అధికార పార్టీ తమ గెలుపునకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్న ధీమాలో ఉంది. జగన్ ఈ పదహారు నెలలో అమలు పర్చిన సంక్షేమ పథకాలే విజయాన్ని సాధించిపెడతాయన్న ధీమాలో ఉన్నారు.తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. దీంతో ఉప ఎన్నికల్లో ఫలితం వన్ సైడ్ గానే ఉంటుందన్నది వైసీపీ అధిష్టానం బిందాస్ గా ఉంది.నెల్లూరు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలోనూ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఒక్క తిరుపతి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ వీక్ గా ఉందన్నది వాస్తవం. గత శాసనసభ ఎన్నికల్లోనే వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అతి తక్కువ ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ బలం ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇటీవల తిరుపతిలో పెరిగిన భూదందాలు వంటివి ఆ పార్టీకి మైనస్ గా మారనున్నాయి.వైసీపీ అధిష్టానం ఇప్పటికే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్ష చేసింది. ప్రధానంగా తిరుపతి, సత్యేవేడు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడు శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది