YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కందిపప్పును బొక్కేస్తున్న పందికొక్కులు

కందిపప్పును బొక్కేస్తున్న పందికొక్కులు

అడ్డగోలుగా బొక్కేయటం, నొక్కేయటం సాధారణమైన పౌరసరఫరాల కార్పొరేషన్‌లో తాజాగా కందిపప్పుకూ కన్నమేసిన వైనం బయటపడింది. నెలకు 154 టన్నులు, అంటే అక్షరాలా కోటి రూపాయలను అక్రమార్కులు జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కార్పొరేషన్‌లోని అధికారులే పాత్రధారులనీ, నెలనెలా మిల్లర్ల నుంచి భారీగా ముడుపులు అందుకుంటున్నారనీ డీలర్లు నేరుగా మంత్రికే ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నో సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. దీనితో దిద్దుబాటు చర్యలపై మంత్రి దృష్టి సారించారు. అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక నుంచి పౌరసరఫరాల నిల్వల గోదాములపై దాడులు నిర్వహించాలని, విషయాన్ని అక్కడే నిగ్గు తేల్చాలని నిర్ణయించారు.

పౌరసరఫరాలశాఖ కార్డుదారులకు కిలో రూ.40 చొప్పున కొద్ది నెలలుగా కందిపప్పు సరఫరా చేస్తోంది. రైతుల నుంచి కందులు సేకరించి, వాటిని మిల్లర్లకు ఇచ్చి, అక్కడినుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా రేషన్‌ షాపులకు పంపిస్తోంది. 50 కిలోల బస్తాల్లో ఈ సరఫరా జరుగుతోంది. సాధారణంగా 50 కిలోల బియ్యం బస్తాకు... గోతం తూకంతో కలిపి 50కిలోల 550 గ్రాములు ఇస్తారు. అంటే ఒక్కో గోతం బరువు 550 గ్రాములు ఉంటుంది. దాని ప్రకారం 50కిలోల 550 గ్రాములు ఇస్తేనే ఈవేమెంట్‌లో బిల్లు జనరేట్‌ అవుతుంది. అయితే కందిపప్పు సరఫరాలో గోనె బరువును పరిగణలోకి తీసుకోకుండానే సరఫరా చేస్తున్నారు. దీనితో వాస్తవానికి ప్రతి క్వింటాకూ 1.100కిలోల కందిపప్పు తగ్గుతోంది. ఒకట్రెండు గోతాలకు ఇది పెద్ద విషయం కాదు. అయితే రాష్ట్రంలో కార్డుదారులకు నెలకు 14వేల టన్నుల కందిపప్పు సరఫరా అవుతుంది. క్వింటాకు రెండు, టన్నుకు 20 గోతాలు... 14వేల టన్నులకు 2.80లక్షల గోనెలు. గోతాంకు 550 గ్రాముల చొప్పున లెక్కిస్తే, మొత్తం 1.54లక్షల కేజీల కందిపప్పు తగ్గుతోంది. సబ్సిడీ లెక్కల ప్రకారం ప్రభుత్వ ఖజానాకు నష్టం రూ.61.60లక్షలు కాగా, బహిరంగ మార్కెట్‌ లెక్కల ప్రకారం కోటి రూపాయలకు పైనే ఉంటుంది.

ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.42కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతిదీ వేల టన్నుల్లోనే ఉంటుంది. ఏ వస్తువు సరఫరా చేసినా దానికి ప్రతి చిన్న అంశాన్నీ పరిగణలోకి తీసుకుని తూకాలు వేస్తారు. కందిపప్పు విషయంలో మాత్రం కార్పొరేషన్‌లోని ఓ ముగ్గురు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే గోనె తూకాన్ని తప్పించినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. తద్వారా మిల్లర్ల నుంచి వారికి ప్రతినెలా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని కొత్తగా వచ్చిన కార్పొరేషన్‌ ఎండీకి, తాజాగా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. మొత్తం వ్యవహారంలో కార్డుదారుడు నష్టపోతున్నాడని, తమకు తక్కువగా సరఫరా కావటంతో వినియోగదారుడికి కూడా ఆ మేరకు తూకంలో తగ్గించే ఇవ్వాల్సి వస్తోందని డీలర్లు చెపుతున్నారు.

Related Posts