YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పతనావస్థలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ

పతనావస్థలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ

విజయవాడ సెప్టెంబ‌ర్ 30, 

భావితరాలు కూడా ఈ అప్పులను తీర్చలేని దుస్థితి  అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ లక్ష కోట్లు వ్యయం చేయాల్సిన దుస్థితి  అటు అప్పుల భారం, ఇటు పన్నుల భారం  -  ప్రకటనలో ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు.
వైసిపి ప్రభుత్వ అవినీతి-అసమర్ధత కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ పూర్తి పతనావస్థకు చేరింది. భావి తరాలు కూడా ఈ అప్పులను తీర్చలేని దుస్థితి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రం దివాలా ముప్పులో అడుగిడిన నేపథ్యంలో భవిష్యత్ తల్చుకుంటే భయమేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం అయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఏడాదిలో చేయాల్సిన అప్పులు తొలి 5నెలల్లోనే తెచ్చారంటే మిగిలిన 7నెలల్లో అప్పులెన్ని చేస్తారో తల్చుకుంటే గుండె గాభరా అవుతోంది. 5నెలల్లో మొత్తం రెవిన్యూ వ్యయం రూ75,669కోట్లు ఉంటే, రెవిన్యూ ఆదాయం రూ 37, 485కోట్లు, అప్పులు రూ 47,130కోట్లు. తొలి 5నెలల్లోనే రెవిన్యూలోటు బడ్జెట్ అంచనాల కన్నా రెట్టింపు కావడం ఆందోళనకర పరిణామం. మూలధన వ్యయం కేవలం రూ 8,851 కోట్లు మాత్రమే చేయడం అభివృద్ది పనులపై వైసిపి నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.  అభివృద్దికే కాదు, రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన దురవస్థ తెచ్చారు. ఈ 5నెలల్లోనే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఎంత కొలాప్స్ అయ్యిందో కాగ్ లెక్కలే సాక్ష్యమని అయన పేర్కోన్నారు.
5నెలల్లో రూ47,130కోట్ల అప్పులు తెచ్చారంటే  ప్రతినెలా సగటు అప్పు రూ 9,426కోట్లు. అంటే ఈ లెక్కన ఏడాదికి రూ 1,13,112 కోట్లకు రాష్ట్ర అప్పులు చేరనున్నాయి. టిడిపి పాలనలో ఏడాదికి రూ26వేల కోట్ల అప్పులు చేస్తే వైసిపి ఏడాదికి రూ 1,13,112కోట్ల అప్పులు చేస్తోంది. టిడిపి హయాం కంటే నాలుగున్నర రెట్లు ఎక్కువ అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. ఈ లెక్కన వైసిపి 5ఏళ్లలో రూ 5,65,560 కోట్ల అప్పులు తేనున్నారు.  62ఏళ్లలో(1956-2018) ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు(టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్) రూ 3,45,000కోట్లు ఉంటే, వైసిపి 5ఏళ్లలోనే రూ 5,65,560కోట్లు దానికి అదనంగా చేరితే, టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ రూ 9,10,560కోట్లకు చేరనుంది.      2023నాటికి మొత్తం అప్పులు రూ 10లక్షల కోట్లు దాటే ప్రమాదం తెచ్చారు. వీటిపై వడ్డీ చెల్లింపులకే రూ లక్ష కోట్లు వ్యయం చేయాల్సిన దుస్థితి వస్తుంది. ఈ 5నెలల్లో ద్రవ్యలోటు రూ 47,130కోట్లు ఉంది. రెవిన్యూ లోటు రూ 38,199కోట్లు ఉంది.  జిఎస్ డిపి అవుట్ పుట్  24% తగ్గిపోతుందని ఎస్ బిఐ లాంటి పలు ఏజెన్సీలు ఇప్పటికే హెచ్చరించాయి. అటు జిఎస్ డిపి  తగ్గిపోయి, ఇటు ద్రవ్యలోటు పెరిగిపోతే, జిఎస్ డిపిలో దవ్యలోటు నిష్పత్తి ఒరిజనల్  గా 3% ఉండాల్సింది, కేంద్రం 5%కు పెంచినప్పటికీ, ఏపికి మాత్రం 9-10%కు చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు. డెట్ టు జిఎస్ డిపి రేటు ఎఫ్ ఆర్ బిఎం ప్రకారం 25% ఉండాల్సింది 35%కు చేరే ప్రమాదం ఉంది. బడ్జెట్ లో రెవిన్యూ డెఫిసిట్ 2% గా చూపినప్పటికీ, ఇదికూడా 5%కు చేరే ప్రమాదం ఉంది. మొత్తం వ్యయం రూ 84,521కోట్లలో మూలధన వ్యయం కేవలం రూ 8,851కోట్లే(10.46%) అంటే ఏపిలో అభివృద్ది దాదాపు నిల్. తెచ్చిన అప్పులు కూడా అభివృద్దిపై  పెట్టడం లేదు. జగన్ అనుచరులకే పంచిపెడుతున్నారని అయన అన్నారు.
ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ37వేల కోట్లు బడ్జెట్ లో చూపారు. ఇందులో ప్రచార ప్రకటనల ఆర్భాటం ఖర్చుకే ప్రాధాన్యం. పేదల ఖాతాల్లో పడే నగదు అరకొరే.. అదికూడా అర్హులైన వారిలో 20-30%మందికే ఇస్తున్నారు.  అర్హులలో మూడొంతుల మందికి ఎగ్గొడుతున్నారు. ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి, 2చేతులతో గుంజుకుంటున్నారు. ఈ 17నెలల్లోనే రూ 20వేల కోట్లపైగా అదనపు పన్నులు వేశారు. అటు అప్పుల భారం, ఇటు పన్నుల భారం, మరోవైపు కరోనా భారం,ఇంకోవైపు వైసిపి భారాలతో కోట్లాది ప్రజలు కుంగిపోయారు. అభివృద్ది శూన్యం, సంక్షేమం శూన్యం, ఉపాధి శూన్యం, పెట్టుబడులు శూన్యం, ప్రగతి శూన్యం, జీరో గవర్నెన్స్ కు ప్రతిబింబంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని అయన వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డి అనుచరుల ఆర్ధికాభివృద్ది మాత్రం బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్ర ఆర్ధికాభివృద్దిని గాలికి వదిలేసి అనుచరుల ఆర్ధికాభివృద్దికే పెద్దపీట వేశారు. పేదల ఆర్ధికాభివృద్దికి గండికొట్టి పెద్దలకు దోచిపెడ్తున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని యనమల అన్నారు.

Related Posts