YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రుల పోరులో నలిగిపోతున్న తమ్ముళ్లు

మంత్రుల పోరులో నలిగిపోతున్న తమ్ముళ్లు

ఓవైపు ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి. మరోవైపు నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. జిల్లాలో క్యాడర్‌కు ధైర్యం చెప్పే నాయకులే కరువయ్యారు. మంత్రుల ఆధిపత్యపోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు. పార్టీపరంగా జిల్లా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ మంత్రులు ఎవరు?

రాజకీయ చైతన్యానికి సిక్కోలు పెట్టింది పేరు! తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం తర్వాత ఆ జిల్లా వాసులు ఆ పార్టీని అమితంగా ఆదరించారు. చంద్రబాబు జిల్లాకు ఎప్పుడొచ్చినా సిక్కోలు అంటే తనకు ఎనలేని అభిమానం అని చెబుతుంటారు. టీడీపీతో ఇంతటి సుదీర్ఘ అనుబంధం ఉన్న జిల్లాలో ఆ పార్టీ నేతల తీరు క్యాడర్‌ను కలవరపరుస్తోంది. ప్రతి విషయానికి వీధికెక్కడం.. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇబ్బందులు తలెత్తడం షరా మామూలు అయిపోయిందనే టాక్‌ జిల్లా టీడీపీలో ఇంటర్నల్‌గా వినిపిస్తుంటుంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గౌతు శిరీష బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈమె పలాస ఎమ్మెల్యే శివాజీ కూతురు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులను కో ఆర్డినేట్‌ చేసుకోవడం ఆమెకు ఇప్పుడు తలనొప్పిగా మారిందట! కింజారపు.. కిమిడి వర్గాల మధ్య ఆది నుంచి వర్గపోరు నడుస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం జిల్లా నుంచి కింజారపు అచ్చెన్నాయుడు.. కిమిడి కళా వెంకట్రావ్‌లు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏ వర్గం ఆగ్రహానికి గురి కావలసి వస్తుందో అన్న టెన్షన్‌ జిల్లా నాయకత్వాన్ని వెంటాడుతున్నదట.

తాజాగా జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పితాని సత్యనారాయణ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో అచ్చెన్నాయుడు.. కళా వెంకట్రావ్‌ వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం జిల్లా పార్టీలో జరుగుతోన్న వర్గపోరుకు మరింత పెంచింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లా కేంద్రంలో తెలుగుదేశంపార్టీ జిల్లా నాయకత్వం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావుకు సముచిత స్థానం ఇవ్వలేదన్నది కొంతమంది వాదన. ఇదే అంశాన్ని విజయవాడ సమావేశంలో కళా వర్గం లేవనెత్తింది. ఇన్‌ఛార్జ్‌ మంత్రి పితాని సమక్షంలో జిల్లా అధ్యక్షురాలు శిరీషను కొంతమంది నేతలు గట్టిగా నిలదీశారట! దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగిందట! మంత్రుల ముందే నేతలు అరుపులు.. కేకలతో సమావేశంలో హీట్‌ పెంచారని సమాచారం.

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంపార్టీకి సొంత కార్యాలయం లేదు. ఇందుకు అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ తెచ్చుకున్న జిల్లా నేతలు జిల్లా కేంద్రంలోని 80 ఫీట్‌ రోడ్‌లో విశాలమైన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి సొంత కార్యాలయంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నది జిల్లా నేతల భావన! ఇంతవరకు బాగానే ఉన్నా నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తేదీలు ఇప్పుడు ఇరువర్గాల మధ్య కొత్త చిచ్చుకు కారణమయ్యాయి. ఈ నెల 29న కార్యాలయ మొదటి అంతస్థును మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా ప్రారంభింపచేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు వర్గం ఓకే చెప్పింది. అయితే కళా వర్గం నేతలు మాత్రం నో చెప్పారట! హడావుడిగా ఒక్క ఫ్లోర్‌ను ప్రారంభించడం కంటే కార్యాలయ పనులు పూర్తిస్థాయిలో జరిగిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబును తీసుకువచ్చి ఆయనతో ప్రారంభిద్దామని కళావర్గం పట్టుబట్టింది. దీంతో ఏం చేయాలో తెలియక నిర్ణయాన్ని పార్టీ పెద్దలకే వదిలేశారట జిల్లా నేతలు!

ఈ పంచాయతీ మంత్రి లోకేశ్‌ వరకూ వెళ్లిందట! అయితే కార్యాలయ పనులు పూర్తి స్థాయిలో జరగక ముందే ప్రారంభించడంలో ఓ లాజిక్‌ ఉందట! ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు శిరీష తన హయాంలోనే పార్టీ కార్యాలయం ప్రారంభం కావాలని గట్టిగా అనుకుంటున్నారు. ఎంతకాదనుకున్నా పూర్తిస్థాయిలో పనులు పూర్తవ్వడానికి కనీసం మరో ఆరు నెలలైనా పడుతుంది. ఓ పక్క మహానాడు బిజీ.. మరోవైపు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పుడే ప్రారంభోత్సవం చేసేస్తే మంచిదన్న అభిప్రాయంతో శిరీష ఉన్నారట! అయితే రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరులో పార్టీ కార్యాలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో ముందు రోజు వరకు చెప్పడం కష్టమంటున్నారు కార్యకర్తలు. ప్రతి చిన్న విషయానికి రోడ్డెక్కుతున్న నేతల తీరు పార్టీ క్యాడర్‌ను ఆవేదనకు గురి చేస్తోంది. బయటకు కలిసి పని చేస్తున్నట్టు కనిపిస్తున్నా .. కీలక సమయాల్లో మాత్రం ముఖ్య నేతల తీరుతో పార్టీకి తిప్పలు తప్పడం లేదు.

Related Posts