శ్రీకాకుళం, అక్టోబరు 1,
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఓ అంశంపై చర్చకు వచ్చింది. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఆయనకు ఎంత వేగంగా అయితే.. అంత స్పీడ్‌గా మినిస్టర్ పోస్టు ఇచ్చేయాల్సిందేనని అంటున్నారు. మరి ఎందుకు ఎంతో మంది నాయకులు ఉండగా.. ఒక్క సీతారాం పైనే చర్చ నడుస్తోంది ? ఆయనకే ఎందుకు టికెట్ ఇవ్వాలని అంటున్నారు ? అంటే.. ఇక్కడే ఉంది.. అసలు కిటుకు. స్పీకర్‌గాఉన్న సీతారాం.. ఇటీవల కాలంలో రాజకీయాలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు.ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయనే స్వయంగా కౌంటర్లు ఇస్తున్నారు. అదే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయనేమన్నా రాజకీయ నాయకుడా.. మంత్రా.. ఇలా వ్యాఖ్యలు చేయడానికి, ఆయన రాజ్యంగ బద్ధమైన స్థానంలో ఉండి ఇలా ఎలా వ్యాఖ్యలు చేస్తారు? అనే వారు కూడా పెరుగుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆయన లెక్క చేయడం లేదు. తాజాగా కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి కొందరిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.ఈ క్రమంలో వీటిపై విచారణను నిలిపివేయడంతోపాటు. ఆయా విషయాలను మీడియాకు కూడా ఇవ్వవద్దని.. హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక కూడా చెల్లదని పేర్కొంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం. అయితే, దీనిపై ఏదైనా మాట్లాడాలంటే.. మంత్రులు చూసుకుంటారు. లేదా నాయకులు చూసుకుంటారు. వారు కూడా కాదంటే.. సలహాదారులు చూసుకుంటారు. కానీ, ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం కలుగ జేసుకుని న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు సంధించారు. ఇవి వివాదానికి దారితీశాయి.ఇక స్పీకర్‌గా ఉన్నా ఫక్తు రాజకీయ నేతగా మాట్లాడేస్తోన్న ఆయన స్థానికంగా తనకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని కూడా చర్చించుకుంటున్నారట. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే కొప్పుల వెలమ కోటాలో ధర్మాన కృష్ణదాస్, మత్స్యకార కోటాలో సీదిరి అప్పలరాజు ఉన్నారు. మరో ఏడాదిలో జరిగే మార్పుల్లో కాళింగ సామాజిక వర్గం కోటాలో స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాంకి మంత్రి పదవి ఖాయమన్న రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే ఆయన ఉత్సాహం చూస్తుంటే అప్పటి వరకు ఆగే పరిస్థితి లేదన్నట్టుగా ఉంది. ఇక ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ హోదాలో ఉండి పార్టీ తరపున వకల్తా పుచ్చుకోవడంపై కాస్త స్లోగా ఉండమని పార్టీ అధిష్టానం చెప్పినా ఆయన మాత్రం ఆగడం లేదు. దీంతో కొందరు సీనియర్లు.. సీతారాంకు మంత్రి పదవి ఇచ్చేస్తే.. ఏగోలా ఉండదు..! అని చర్చించుకుంటుండడం గమనార్హం.