అనంతపురం, అక్టోబరు 1,
రాష్ట్రంలో అవసాన దశలో ఉందని భావిస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దింపుడు కళ్లెం స్థాయికి దిగజార్చేశారా ? కాంగ్రెస్ ఇంకా కోలుకునే స్థాయిలోనే ఉంది.. పర్లేదు పుంజుకుంటుంది? సీనియర్లు ఇంకా చావగానే ఉన్నారు.. అనే పరిస్థితి నుంచి .. ఇక, ఆశల్లేవు.. కాంగ్రెస్ పూర్తిగా ఖల్లాస్ అయిపోయింది. అనే స్థాయికి తెచ్చేశారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అనంతపురానికి చెందిన సీనియర్ నాయకుడు , దళిత నేత.. సాకే శైలజానాథ్.. పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. రఘువీరారెడ్డి కాడి కింద పడేయడంతో తన స్థిర ఓటు బ్యాంకు అయిన ఎస్సీలను అయినా ఆకట్టుకోవాలన్న ప్లాన్‌తో అధిష్టానం సాకే శైలజానాధ్ కు ఏపీ పగ్గాలు అప్పగించింది.ఆయనపై పార్టీ నేతలు, పార్టీ అధిష్టానం కూడా చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ, ఇప్పటి వరకు ఆయన పార్టీకి జవసత్వాలు ఇచ్చింది లేదు. ముందుకు నడిపించింది లేదు. దీంతో ఎక్కడి పార్టీ అక్కడే ఉంది. పైగా ఇప్పుడు సాకే శైలజానాధ్ నిర్వాకంతో పార్టీ మరింతగా దిగజారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఆయన తాజాగా రాజధాని విషయంపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తాము ఒక రాజధానికే కట్టుబడి ఉన్నామని.. ఏపీకి రాజధానిగా కేవలం అమరావతి చాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో రైతులకు న్యాయం చేయాలని కూడా సూచించారు.ఇంతవరకు బాగానే ఉంది. అయితే, ఎప్పుడైనా..ఎక్కడైనా.. ఒక అఫిడవిట్‌ను పార్టీలో చర్చించారా ? నేతలను సంప్రదించారా? ఎవరైనా తమ అభిప్రాయం చెప్పారా ? లేక సాకే శైలజానాథ్ తన అభిప్రాయాన్నే.. అందరి అభిప్రాయంగా వ్యక్తీకరించారా ? అనేసందేహాలు పార్టీలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో మరింతగా సాకే శైలజానాధ్ తో వారికి గ్యాప్ పెరిగిపోయింది. పార్టీలో చర్చించి.. తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తన ఇష్టానుసారం ఎలా ?తీసుకుంటారని ఇప్పుడు ఉన్న నలుగురైదుగురు నాయకులు కూడా పెదవి విరుస్తున్నారు.పైగా కాంగ్రెస్ ఇచ్చిన అఫిడవిట్.. టీడీపీ ఆఫీస్‌లో తయారై నట్టుగా ఉందని అనేవారూ కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామం.. కాంగ్రెస్‌ను మరింత నాకించేయడం ఖాయమని చెబుతున్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ది చెందాలనేది కాంగ్రెస్ సిద్ధాంతమని.. ఈ క్రమంలో అన్ని ప్రాంతాల్లోనూ ప్రజాభిప్రాయం సేకరించి.. దానికి అనుగుణంగా అఫిడవిట్ ఇచ్చి ఉంటే.. బాగుండేదని అంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌లో మూడు ప్రాంతాల ప్రస్థావన లేకపోవడంపైనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.