YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శ్రమదోపిడీ

శ్రమదోపిడీ

జిల్లాలో శ్రామికులు దోపిడీకి గురవుతున్నారు. శ్రమకు తగిన వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు దళారులు ప్రవేశించి బడుగు జీవులను దగా చేస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధి, అ పక్కన ఉన్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని పరిశ్రమలు తమకు కావలసిన రోజు వారీ కూలీలను ఏర్పాటు చేసే పనిని కొందరు దళారులకు అప్పగించాయి. వారు కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలను మొత్తంగా గుత్తేదారుల చేతిలో పెడుతోంది. ఈ నేపథ్యంలో సదరు గుత్తేదారులు పూర్తి వేతనం ఇవ్వకుండా భారీ మొత్తంలో కోత విధించి కొంత వరకే కూలీల చేతుల్లో పెడుతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోజు కూలి రూ.350 ఉంటే రూ.250 నుంచి రూ.300 మాత్రమే చెల్లిస్తున్నారు. కూలీల చేత అసలు మొత్తానికి సంబంధించి సంతకాలు తీసుకుంటున్నారు.

ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో ఆయా ఉత్పత్తులకు సంబంధించిన 10 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సుమారు 4వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇందులో మహిళలు, యువకులు మధ్యవయసు ఉన్న వారు ఉన్నారు. వీరికి పని, అనుభవాన్ని బట్టి రోజుకు రూ.235 నుంచి రూ.500 వరకూ వేతనం ఉంది. రూ.50 నుంచి రూ.100 వరకూ కొత విధించి మిగిలిన డబ్బులు విధిస్తున్నారు. వాస్తవానికి సంబంధిత పరిశ్రమే నేరుగా కూలికి వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో దళారుల సంబంధం ఉండరాదు. కొన్ని కంపెనీలు కార్మిక చట్టాన్ని అనుసరించి వేతనాలు ఇస్తున్నప్పటికీ మధ్యలో ఉన్న దళారులు బడుగుల కష్టాన్ని గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఒక వేళ కూలీలను తీసుకు రావడానికి కాంట్రాక్టర్ ఉన్నప్పటికీ సదరు వ్యక్తికి పరిశ్రమ కొంత వేతనం ఇస్తుంది తప్పా ఇలా కూలీల డబ్బుల్లో కోత విధించే అధికారం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం చాపకిందనీరుగా సాగిపోతోంది.

ఇందులో కొన్ని పరిశ్రమలు వేతనాలు తక్కువగా ఇవ్వడమే కాకుండా పనిగంటల పెంచేస్తున్నారు. చట్టం ప్రకారం 8గంటలకే పనిచేయించాల్సి ఉండగా 12 గంటల పాటు పనిచేయించకుంటున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీడిగింజల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు నెలకు రూ.6,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడం లేదు. ఒక వేళ సెలవు పెడితే ఆరోజు వేతనం ఇవ్వరు. ఇక్కడ భద్రతా చర్యలు లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు అనారోగ్యంతో బాధపడ్డారు. అందువల్ల చాలా మంది మహిళలు పని మానివేశారు.

నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రోజువారీ కూలీలు, కంపెనీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా పనిచేయిస్తున్నారని, భోజనం చేయడానికి కూడా సమయం లేకుండా చేస్తునారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పరిశ్రమలతో చేతులు కలుపుతూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts