YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రైతులకు ఈ-పాస్ తంటాలు

రైతులకు ఈ-పాస్ తంటాలు

రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలి.. విక్రయాల్లో అక్రమాలకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో ఈ-పాస్‌ విధానాన్ని గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. యంత్రాల సరఫరా బాధ్యతను పలు కంపెనీలకు అప్పగించింది. ఈమేరకు జిల్లాలోని డీలర్లందరికీ ఈ-పాస్‌ యంత్రాలను సరఫరా చేశారు. రైతు ఆధార్‌ నంబరు, వేలిముద్రల ఆధారంగా ఎరువులను పంపిణీ చేస్తున్నారు. అయితే సర్వర్‌ సమస్య, తరచూ యంత్రాలు మరమ్మతుకు గురవడంతో డీలర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు రైతులకు ఇబ్బందులు తప్పలేదు.

జిల్లాలో ఏటా 1.24 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. 550 మంది డీలర్లు ఉన్నారు. ఫ్యాక్ట్‌, ఆర్‌సీఎఫ్‌, జువారీ, ఎంఎఫ్‌ఎల్‌, దీపక్‌ కంపెనీలు ఈ-పాస్‌ యంత్రాలను సరఫరా చేశాయి. 550 మంది డీలర్లకు గతేడాది యంత్రాలు అందాయి. అవి సక్రమంగా  పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు ఆయా కంపెనీలే చేయించాలని ఒప్పందం చేసుకున్నారు. కానీ కంపెనీల ప్రతినిధులు ఎక్కడున్నారో తెలియదు. యంత్రం ద్వారా ఎరువులను కొనుగోలు చేస్తేనే రైతులకు రాయితీలు అందుతాయి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది.

ఈ-పాస్‌ యంత్రాలను పట్టుకుని వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ డీలర్లు తిరుగుతున్నారు. కంపెనీల ప్రతినిధులు జిల్లాలోనే అందుబాటులో ఉండాలి. కానీ వారి జాడేలేదు. 15 రోజులకొకసారి ప్రతినిధులు వస్తున్నా.. డీలర్లకు సమాచారం ఇవ్వడం లేదు. వ్యవసాయాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తెలియక అటు అధికారులు, ఇటు డీలర్లు అవస్థలు పడుతున్నారు.

Related Posts