YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇలా అయితే ఎలా..?

ఇలా అయితే ఎలా..?

రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ దంత కళాశాలలో పీజీ డెంటల్‌ సీట్లకు కోత పడింది. అధ్యాపకుల కొరతతో డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 5 సీట్లకు అనుమతి నిరాకరించింది. చివరి నిమిషంలో సీట్ల కోత పడటంతో టాపర్లు కూడా సీటు దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. చివరికి స్టేట్‌ ర్యాంకు 10 లోపు వచ్చినా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు రాని వైనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలల్లో 29 పీజీ సీట్లు ఉన్నాయి. గత ఏడాది కూడా ఈ మేరకు సీట్ల భర్తీ చేశారు. ఈ సారి అదే తరహాలో సీట్లు ఉంటాయని విద్యార్ధులు భావించారు. కానీ అకస్మాత్తుగా మార్చి 28న కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌లో గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజీలో 5 సీట్లకు డీసీఐ అనుమతి నిరాకరించిందని పేర్కొంది.

అధ్యాపకుల కొరత కారణంగా పెడో డోంటిక్స్‌ ఒక సీటు, ఆర్తోడోంటిక్స్‌ ఒక సీటు ఓరల్‌ పాథాలజీలో మూడు సీట్లకు డీసీఐ అనుమతి నిరాకరించింది. వాస్తవానికి పరీక్షలకు ముందే నోటిఫికేషన్‌ ద్వారా ఫలానా సీట్లు అందుబాటులో లేవని తెలపాల్సి ఉంటుంది. అలా తెలియజేస్తే.... విద్యార్థులు అప్రమత్తం అయ్యేవారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చివరి వరకు తమకు విషయం తెలియదని విద్యార్ధులు వాపోతున్నారు. ప్రైవేటుకు వెళ్లాలంటే కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వ కళాశాలలో అర్హత మేరకు సీటు దక్కుతుందా అంటే అసలు సీట్లకే కోతపడిందని వాపోతున్నారు.

మిట్టపల్లి స్నేహాక్షి జాతీయ స్థాయిలో నీట్‌ పీజీ డెంటల్‌ విభాగంలో 991 ర్యాంకు, స్టేట్‌ లెవల్‌లో 11 వ ర్యాంకు సాధించారు. అలాగే చరణ్‌ రెడ్డి అనే విద్యార్థి కూడా రాష్ట్ర స్థాయిలో 8 వ ర్యాంకు సాధించారు. మరికొంత మంది విద్యార్థినులకు 12, 13 ర్యాంకు వచ్చినా ప్రభుత్వ దంత కాలేజీలో సీటు రాకపోవడం దురదృష్టకరమైన విషయం. కష్టపడి చదివినా సీటు లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమైన శుక్రవారం నాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు డీఎంఈ రమేశ్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌ను కలసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.

 ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో కోతకు గురైన ఈ సీట్లకు ప్రైవేటు కాలేజీల్లో ఒక్కో దానికి రూ. 50 లక్షల వరకు పలుకుతోంది. అంటే ఈ ఐదు సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో ఆ విద్యార్ధులు చేయాలంటే కనీసం రెండున్నర కోట్లు ఖర్చు చేయాలి. కాగా తొలి విడత సీటు దక్కించుకున్న విద్యార్థులకు ఫీజు చెల్లించే గడువు ఏప్రిల్‌ 20 వరకు ఉంది. కనీసం ఫీజు కట్టే తేదీ గడువు అయినా పెంచితే.... డబ్బు సర్దుబాటు చేసుకుంటామని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇక ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో సీటు పొందినా కూడా ఏడాదికి అన్ని ఫీజులు కలుపుకొని దాదాపు రూ.7 లక్షల వరకు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts