తిరుపతి, అక్టోబరు 2,
నగరిలో రాజకీయాలు వేడెక్కాయి. ఆర్కే రోజా నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలోనూ, పార్టీలోనూ రోజా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆర్కే రోజా గత కొంతకాలంగా తన నియోజకవర్గంలో కొందరు వేలుపెడుతున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. స్థానిక నేతలను కొందరు మంత్రులు ప్రోత్సహిస్తూ తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారంటూ ఆర్కే రోజా ఆవేదన చెందుతున్నారు.తాజాగా బీసీ కార్పొరేషన్ల నియామకం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్కే రోజా మరోసారి అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది. ఆర్కే రోజాకు స్థానిక వైసీపీ నేత కేజే కుమార్ కు మధ్య పొసగడం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో కేజే కుమార్ కార్యక్రమానికి వైసీపీ నేతలు ఎవరూ హాజరుకావద్దని ఆర్కే రోజా ఒక ఆడియో టేపును కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కేజే కుమార్ భార్య కేజే శాంతికి బీసీ కార్పొరేషన్లలో ఛైర్మన్ పదవి దక్కిందని ప్రచారం జరుగుతుంది. కేజే శాంతికి ఈడిగ కొర్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించినట్లు ఆమెకు సమాచారం అందిందని చెబుతున్నారు. దీంతో రోజా ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కడంతో ఆమె అనుచరుల్లోనూ అసహనం వ్యక్తమవుతుంది. నిజానికి బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉన్నా వాయిదా పడింది.కేజే కుమార్ సతీమణి శాాంతికి ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కడం వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ఆర్కే రోజా అనుమానిస్తున్నారు. గతంలోనూ మరో మంత్రి నారాయణస్వామి తన నియోజకవర్గంలో చెప్పకుండా పర్యటించిన విషయంపైనా ఆమె అసహనంతో ఉన్నారు. తాజాగా జగన్ నిర్ణయంతో ఆర్కే రోజా మరింత అసంతృప్తికి గురవుతున్నారని తెలిసింది. ఇంకా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను ప్రకటించకపోవడంతో నేరుగా జగన్ ను కలసి ఆ నియామకాన్ని ఆపాలన్న ప్రయత్నంలో ఆర్కే రోజా ఉన్నట్లు తెలిసింది. మరి ఆర్కే రోజా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.