తిరుపతి, అక్టోబరు 2,
ఎక్కడ అవకాశం వస్తే.. అక్కడ రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు ఉండరని అంటారు పరిశీలకులు. ఆయన వేసే అడుగులు తీసుకునే నిర్ణయాలు కూడా ఇలానే ఉంటాయి. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనూ ఇలానే ఆలోచిస్తున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్‌రావు.. హఠాన్మరణం చెందారు. దీంతో ఇక్కడ మరి కొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడ వేయాలని నిర్ణయించారట.సాధారణంగా.. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ అభ్యర్థి మృతి చెందారో.. ఆ అభ్యర్థి కుటుంబానికి సహజంగానే సదరు పార్టీ టికెట్ ఇస్తుంది. దీంతో సెంటిమెంటుగా భావించి ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉంటాయి. గతంలో కృష్ణాజిల్లాలో తంగిరాల ప్రభాకర్ మృతి చెందినప్పుడు టీడీపీ ఆయన కుమార్తె సౌమ్యకు టికెట్ ఇచ్చింది. ఈ సమయంలో వైసీపీ దూరంగా ఉంది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి చనిపోయారు కాబట్టి సంప్రదాయం ప్రకారం.. టీడీపీ కూడా దూరంగా ఉంటుందనే భావన వైసీపీలో వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తిరుపతి సిట్టింగ్ ఎంపీ వెంకటరమణ మృతి చెందడంతో ఇక్కడ వైసీపీ నాడు పోటీ చేయలేదు.అయితే అప్పుడు కాంగ్రెస్ పోటీ చేయగా నామమాత్ర పోరులో టీడీపీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక ఇప్పుడు అదే తిరుపతిలో ఈ సెంటిమెంటును పాటిస్తూనే.. రాజకీయంగా దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సెంటిమెంటు మేరకు తిరుపతిలో తాము అభ్యర్థిని నిలబెట్టడం లేదని బాబు ప్రచారం చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఇది రాజకీయంగా ఆయనకు మంచి మార్కులు వేయించొచ్చు. ఇక, అదే సమయంలో జగన్‌పై కసి తీర్చుకునేందుకు ఇక్కడ నుంచి పోటీ చేసే బీజేపీకి పరోక్షంగా సాయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.వాస్తవానికి తిరుపతి ఎంపీ స్థానంలో టీడీపీకి అంత బలం లేదు. దీంతో ఇక్కడ పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఏకంగా 2.28 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బల్లి దుర్గాప్రసాద్ గతంలో చంద్రబాబుకు మిత్రుడే. ఈ క్రమంలోనే ఇక్కడ ఉప ఎన్నికల్లో చంద్రబాబు పోటీ పెట్టకపోవడానికి ప్రధాన కారణాలు కాగా.. సెంటిమెంటు ఎలానూ వర్కవుట్ అవుతుంది. దీంతో పోటీకి దూరంగా ఉంటూ.. మరోపక్క, బీజేపీ కనుక అభ్యర్థిని నిలబెడితే.. తన వంతు సాయంగా సదరు అభ్యర్థికి ఓట్లు పడేందుకు సహకరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలా బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు ఈ ఛాన్స్ కూడా వాడుకుంటున్నారనే టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు