హైద్రాబాద్, అక్టోబరు 2,
నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రగులుతూనే ఉంది. రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ సీఎస్‌లకు కేంద్ర జలశక్తిశాఖ లేఖ రాసింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ వేదికగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను కుండబద్దలు కొట్టి ఏపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఆగస్టు 5న సమావేశం జరగాల్సి ఉండగా.. కేసీఆర్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత మరోసారి సమావేశం నిర్వహించాలని భావించగా.. కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ రావడంతో భేటీ వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 6న నిర్వహించ తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేదా మరోసారి వాయిదా పడుతుందా అనే వాదన కూడా వినిపిస్తోంది.అయితే ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఏపీ తీరుతో పాటు కేంద్రం తీరును ఎండగట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణకు వ్యతిరేఖంగా ఏపీ వ్యవహరిస్తుంది. నదీ జలాల ప్రతీ విషయంలోనూ కయ్యానికి కాలుదువ్వుతోంది. దీంతో కేసీఆర్ ఈ సమావేశం ద్వారా ఏపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుందని, అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం ఇవ్వాలని, మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. దీనిలో భాగంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు గురువారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నదీ జలాల విషయంలో ఏపీ తీరుతో పాటు కేంద్రం తీరును ఎండగట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేయనున్నారు.ఇప్పటికే ఏపీ తీరుపై మండిపడుతున్న సీఎం కేసీఆర్.. కేంద్రం నిర్లక్ష్యం వైఖరిపైనా ఆగ్రహంతో ఉన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాసి నీటి కేటాయింపులు జరపాలని కోరామని, అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం -1956 సెక్షన్ మూడు ప్రకారం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసైనా, లేదంటే ఉన్న ట్రైబ్యునల్ ద్వారా అయినా కేటాయింపులు జరపాలని చెప్పామని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఏడేళ్లు గడిచినా ప్రధానమంత్రికి రాసిన లేఖకు స్పందన లేకపోవటంతో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, కేంద్రం తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది.మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం తమ వాదనను సమర్థవంతంగా వినిపించేందుకు, తద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వ్యూహాలను ఏపీ సీఎం జగన్ ఏ విధంగా ఎదుర్కొంటారు..? కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి సమాధానం ఇవ్వనుంది అనే అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.