విజయవాడ, అక్టోబరు 3,
ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు.. జగన్ సర్కారుకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు.. హిందూ దేవాలయాలపై దాడులు.. దొంగతనాలు.. దగ్ధాలు.. వంటి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మరోపక్క రాజధాని అంశం ఎటూ తేలలేదు. ఇంకోపక్క, కేసుల విషయంలో కీలక నేతల అరెస్టు వద్దంటూ.. హైకోర్టు నుంచి ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్న తీరు కూడా జగన్ సర్కారుకు తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది.మొత్తంగా ఒక్కసారిగా.. ప్రభుత్వానికి ఇంత ఉక్కిరి బిక్కిరి పరిస్థితి ఏర్పడడం వెనుక ఎవరున్నారు? ఎవరు తలుచుకుంటే.. జగన్ ఇంతగా ఇబ్బంది పడుతున్నారు. అటు కక్కలేక.. ఇటు మింగలేక.. సతమతమవుతున్నారు ? అంటే.. ఖచ్చితంగా దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారనే అంటున్నారు టీడీపీ నేతలు. సహజంగానే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై టీడీపీలో చర్చ వచ్చింది. ఈ క్రమంలో తమ్ముళ్లు తేల్చిన విషయం.. మన బాబే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.. అని..!మరి ఈ వ్యూహం అంటే…! రాష్ట్రంలో ఎలాగూ ఆయనకు అధికారం పోయింది. ఇక్కడ ఆయన మాట వినే అధికారి ఎవరూ లేరు. పక్కరాష్ట్రం తెలంగాణలోనూ ఆయన కుక్కిన పేనల్లే ఉంటున్నారు. మరి ఎవరు చంద్రబాబుకు ఇప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు? అంటే.. తమ్ముళ్ల వేళ్లన్నీ.. ఇప్పుడు ఢిల్లీ వైపు చూపిస్తున్నాయి. నిజమే.. తాను అధికారంలో ఉన్న సమయంలో చాలా మందికి చంద్రబాబు మేళ్లు చేశారు. ఈ మేళ్లు వల్ల లబ్ధిపొందిన వారిలో ఇప్పుడు కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్నవారు కూడా ఉన్నారనే టాక్..?ఈ చాలా మందిలోనే మరి కొందరు ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. వారిలో ఒకరిద్దరు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లోనూ ఉన్నారని తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు.. ఇక్కడ చెలరేగిపోతున్నారు. మేనేజ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చించు కుంటున్నారు. ఈ విషయం టీడీపీ నేతల్లోనే పెద్ద ఎత్తున చర్చకు వస్తుండడం ఆలోచించాల్సిన విషయమే..!